అత‌డు చేసిన త‌ప్పున‌కు కోహ్లీకి 500 ఫైన్!

Update: 2019-06-08 07:59 GMT
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి రూ.500 జ‌రిమానా విధించారు మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఆఫ్ గురుగ్రామ్‌. అయితే.. నేరుగా తాను త‌ప్పు చేయ‌న‌ప్ప‌టికి ఫైన్ క‌ట్టాల్సిన ప‌రిస్థితి కోహ్లీకి ఎదురుకావ‌టం విశేషం. కోహ్లీ ఇంట్లో ప‌ని చేసే సిబ్బంది చేసిన త‌ప్పున‌కు కోహ్లీకి ఫైన్ విధించారు మున్సిప‌ల్ సిబ్బంది. అస‌లేం జ‌రిగిందంటే..

గురుగ్రామ్ లోని డీఎల్ ఎఫ్ ఫేజ్ 1లో కోహ్లీ నివాసం ఉంటున్నారు. ఆయ‌న ఇంట్లో మొత్తం ఆరు కార్లు ఉన్నాయి. వీటిని శుభ్రం చేసే క్ర‌మంలో.. ఇంట్లో ప‌ని చేసే ప‌నిమ‌నిషి కార్ల‌ను క‌డిగేందుకు మంచినీటిని ఉప‌యోగించాడు. ఈ విష‌య‌మై స్థానికులు మున్సిప‌ల్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు కోహ్లీకి జ‌రిమానా విధిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

దేశ వ్యాప్తంగా ప్ర‌స్తుతం ప‌లు ప్రాంతాల్లో నీటి కొర‌త‌తో తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్న పరిస్థితి. ప‌లు ప్రాంతాల్లో తాగు నీటి కోసం నీళ్లు దొర‌క‌ని ప‌రిస్థితి. ఇలాంటివేళ‌.. కొంత‌మంది సంప‌న్నుల ఇళ్ల‌ల్లో వేలాది గ్యాల‌న్ల నీళ్లు వృథా అవుతున్నాయి.

ఇలాంటి ప‌రిస్థితే గురు గ్రామ్ లో చోటు చేసుకోవ‌టంతో తాగునీటిని పొదుపుగా వాడుకోవాల్సిందిగా అధికారులు కోరుతున్నారు. ఇలాంటివేళ‌.. కొంద‌రు నీటిని వృధా చేయ‌టం.. అన‌వ‌స‌ర‌మైన వాటి కోసం వినియోగించ‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో స్థానికుల ఫిర్యాదుతో కోహ్లీకి రూ.500 జ‌రిమానా విధిస్తూ మున్సిప‌ల్ సిబ్బంది నిర్ణ‌యం తీసుకున్నారు. వ‌ర‌ల్డ్ క‌ప్ క్రికెట్ టోర్నీలో భాగంగా ప్ర‌స్తుతం కోహ్లీ లండ‌న్ లో ఉన్నారు.


Tags:    

Similar News