పుతిన్, ట్రంప్ భాయిభాయి

Update: 2016-11-15 10:28 GMT
    డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ప్రపంచవ్యాప్తంగా జియో పాలిటిక్సు కీలక మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఉప్పు నిప్పులా ఉండే అమెరికా - రష్యాలు కలిసే సూచనలు కనిపిస్తున్నాయి.  డొనాల్డ్ ట్రంప్ సోమవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ సాగించిన సంభాషణలు అందుకు ఊతమిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తీసుకు వచ్చేందుకు ఇద్దరు నేతలు ఈ సందర్భంగా అంగీకారానికి వచ్చారు. ప్రత్యక్షంగా సమావేశం అయ్యేందుకు కూడా వీరు అవగాహనకు వచ్చారని రష్యా అధ్యక్ష భవన వర్గాలు తెలిపాయి.

అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందినందుకు ట్రంప్‌ కు పుతిన్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ సందర్భంగా ఇద్దరూ ముచ్చటించుకున్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాల పట్ల ట్రంప్ - పుతిన్ ఇద్దరూ కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారట. ఈ ఉద్రిక్తతలను తొలగించడానికి .. సమానత్వం - పరస్పర గౌరవం - ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో మరో దేశం జోక్యం చేసుకోకపోవడం అనే అంశాల ఆధారంగా ట్రంప్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధమని పుతిన్ తెలిపారు.

మరోవైపు అమెరికా ఎన్నికల ప్రచారం సమయంలోనే ట్రంప్‌ కు పుతిన్ మద్దతు పలికారు. ట్రంప్ కూడా పలుమార్లు రష్యా అధ్యక్షుడి పేరును స్మరించడంతోపాటు ఆయన్ను పొగిడారు, పుతిన్‌ తో కలిసి పని చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.

రష్యా - అమెరికాలు అంశాలవారీగానైనా కలిసి పనిచేస్తే ప్రపంచ రాజకీయాల్లో పెను మార్పులు రావడం ఖాయం. ముఖ్యంగా భారత్ వంటి దేశాలకు ఇది మరింత మంచి పరిణామం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News