జగనే స్ఫూర్తి అంట..వీవీ వినాయక్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనా?

Update: 2019-08-12 14:59 GMT
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ సినిమాలను వదిలేసి రాజకీయాల వైపు పయనించే దిశగా సాగుతున్నారా? అన్న కోణంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైఎస్ ఫ్యామిలీతో తమకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని గతంలో చాలా స్పష్టంగా ప్రకటించిన వినాయక్... అవకాశం వచ్చినా కూడా ఎందుకనో నాడు రాజకీయాల్లోకి రాలేదని కూడా వ్యాఖ్యానించారు. అయితే ఇటీవల వినాయక్ వేస్తున్న అడుగులను పరిశీలిస్తూ ఉంటే... వినాయక్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది. ఈ దిశగా చోటుచేసుకుంటున్న పరిణామాల్లో నిన్న జరిగిన పరిణామం అత్యంత కీలకమైనదేనని - నిన్నటి వ్యాఖ్యలతోనే వినాయక్ పాలిటిక్స్ వైపు దృష్టి సారించినట్లుగా అర్థమవుతోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

అయినా నిన్న ఏం జరిగిందన్న విషయానికి వస్తే.. నిన్న విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ గా తూర్పు గోదావరి జిల్లా రాజా నగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నేతలు పెద్ద సంఖ్యలో వచ్చినా... ఆ కార్యక్రమానికి హాజరైన వినాయక్ అందరి దృష్టిని ఆకర్షించారు. ఏదో జక్కంపూడి రాజాతో సన్నిహిత సంబంధాాల నేపథ్యంలోనే వినాయక్ ఈ కార్యక్రమానికి వచ్చారనుకున్నా... కార్యక్రమంలో తనదైన శైలి ప్రసంగం చేసిన వినాయక్.. జగన్ తనకు ఎలా మార్గదర్శకుడయ్యాడన్న విషయాన్ని చాలా ఆసక్తికరంగా చెప్పారు. తాజాగా ముగిసిన ఎన్నికల్లో వైసీపీ బంపర్ విక్టరీ కొడితే... జగన్ సీఎం పదవిని చేపట్టారు. సీఎంగా పదవీ ప్రమాణం చేసే సమయంలో జగన్ చేసిన ప్రసంగాన్ని ప్రస్తావించిన వినాయక్... ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం 4 కోట్ల మందిలో సీఎం అయ్యే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు అని జగన్‌ అన్నారని - ఆ మాటలు తనకు బాగా నచ్చాయని వినాయక్‌ చెప్పుకొచ్చారు.

ఆ మాటలు స్ఫూర్తి నింపడం వల్లే దర్శకుడిగా కొనసాగుతున్న తాను నటుడిగా మారేందుకు జిమ్‌ కు వెళ్లడం ప్రారంభించానని ఆయన చెప్పారు. మొత్తంగా జగన్ చేసిన సదరు వ్యాఖ్య తన గమనాన్నే మార్చేసిందని చెప్పిన వినాయక్... త్వరలోనే వైసీపీలో చేరడం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే... 2014 ఎన్నికల్లోనే రాజకీయాల్లోకి రావాలని - వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేయాలని వినాయక్ భావించారని - అయితే ఎందుకనో అప్పుడు కుదరలేదని వినాయక్ సన్నిహితుల మాటగా వినిపిస్తోంది. గతం మాదిరిగా కాకుండా ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడం - జగన్ చేస్తున్న వ్యాఖ్యలను - వేస్తున్న అడుగులను చాలా జాగ్రత్తగా గమనిస్తున్న వినాయక్ ను చూస్తుంటే... ఆయన అతి త్వరలోనే వైసీపీలో చేరే అవకాశాలు లేకపోలేదన్నవాదన వినిపిస్తోంది.

   

Tags:    

Similar News