వరంగల్ ఉప ఎన్నికలో పోలింగ్ 69 శాతం

Update: 2015-11-22 04:12 GMT
వరంగల్ ఉప ఎన్నికలో పోలింగ్ 69 శాతం
  • whatsapp icon
వరంగల్ ఉప ఎన్నికల్లో మరో అంకం ముగిసింది. ఎన్నికల్లో అత్యంత కీలకమైన పోలింగ్ పూర్తి అయ్యింది. అంచనాలకు తగ్గట్లే భారీగానే పోలింగ్ నమోదైంది. 2009.. 2014తో పోలిస్తే.. కాస్త తగ్గినప్పటికీ.. ఉప ఎన్నికల్లో ఈ మాత్రం పోలింగ్ అంటే గొప్పేనన్న మాట వినిపిస్తోంది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో 69.01 పోలింగ్ నమోదు కాగా.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో 76.15 శాతం నమోదైంది. దాంతో పోలిస్తే.. తాజాగా నమోదు అయిన 68.5 (సాంకేతికంగా 69గా లెక్కేస్తారు) శాతం ఎక్కువనే చెప్పొచ్చు.

శనివారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మధ్యాహ్నం వరకూ ఒక మోస్తరుగా పోలింగ్ జరగగా.. మధ్యాహ్నం తర్వాత మరింతగా ఊపందుకొంది. స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.

2014 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే.. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో పోలింగ్ దాదాపు 7 శాతం తగ్గిన నేపథ్యంలో మెజార్టీ తగ్గే అవకాశం ఉందని చెప్పొచ్చు.2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాజయ్యపై టీఆర్ ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి.. 3,92,937 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర పరిధిలోని 17 లోక్ సభా నియోజకవర్గాల్లో కడియం శ్రీహరిదే అత్యధిక మెజార్టీ. తాజాగా ఉప ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఈ మెజార్టీ పెద్ద ఎత్తున తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.

వరంగల్ లోక్ సభా నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరకాలలో అత్యధిక పోలింగ్ జరగగా.. వరంగల్ పశ్చిమలో నమోదైంది. మొత్తంగా చూస్తే.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ 2014 సార్వత్రిక ఎన్నికల్లో పోలిస్తే.. ఈ ఉప ఎన్నికల్లో తగ్గింది. పరకాలలో 76.6 శాతం పోలింగ్ నమోదు కాగా.. వరంగల్ పశ్చిమంలో అత్యల్పంగా 48.03కే పరిమితమైంది. ఈ నియోజకవర్గంలో తగ్గిన పోలింగ్.. మొత్తమ్మీదా పోలింగ్ తగ్గటానికి కారణమైంది.
Tags:    

Similar News