వామ్మో.. ప్రభుత్వ ఉద్యోగులపై ఇన్ని ఫిర్యాదులా!

Update: 2015-03-19 05:23 GMT
విధి నిర్వహణలో అలసత్వం... అవినీతి... భారత్‌లోని ప్రభుత్వ ఉద్యోగులకు చాలా సహజ గుణాలు. వీటికి జనాలు కూడా పూర్తిగా అలవాటు పడిపోయారు. ప్రభుత్వ ఉద్యోగులంటే అంతే.. వారికి లంచమిచ్చి పనిచేయించుకోవాలి... అనే ప్రబలమైన నమ్మకం ఉంది జనసామాన్యంలో. వ్యక్తిగతంగా నిజాయితీపరులైన అధికారులు కూడా ఎంతో మంది ఉంటారు. అయితే.. గవర్నమెంటు ఉద్యోగుల ఇమేజ్‌పై మాత్రం చాలా మరకలున్నాయి.

    ఇలాంటి వ్యవస్థ పరిస్థితి గురించి స్పష్టంగా తెలియజెప్పుతున్నాయి ఫిర్యాదుల గణంకాలు. అధికారుల అవినీతికి, అలసత్వానికి చాలా మంది ప్రజలు అలవాటు పడిపోయినా.. కొందరు అమాయకులు మాత్రం అధికారుల గురించి వారి పైఅధికారులకు కంప్లైంట్‌ చేస్తున్నారు. అక్కడ కూడా ఫలితం దక్కకపోవడంతో విజిలెన్స్‌ వరకూ వెళుతున్నారు.

    ఇలాంటి నేపథ్యంలో సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ కు ఏడాదిలో వచ్చిన ఫిర్యాదుల సంఖ్య గురించి పార్లమెంటులో చర్చ జరిగింది. సీవీసీ దగ్గరకు వచ్చిన ఫిర్యాదుల సంఖ్య 62వేలకు పైనే అని కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ ప్రకటించాడు.

    ఏడాది వ్యవధిలో ఈ ఫిర్యాదులొచ్చాయని ఆయన వివరించారు. వీటిలో పాతికవేల ఫిర్యాదులపై చర్యలు తీసుకొన్నట్టుగా ఆయన ప్రకటించుకొన్నారు. మరి ప్రభుత్వ అధికారుల అవినీతి విషయంలో సీవీసీ వరకూ వెళ్లి ఫిర్యాదు చేయవచ్చని తెలిసిన భారతీయులు అతి తక్కువ మంది. అయినా.. 60 వేలకుపైగా ఫిర్యాదులు నమోదయ్యాయంటే.. వ్యవస్థ దుస్థితిని సులభంగా అర్థం చేసుకోవచ్చు!
Tags:    

Similar News