బెంగాల్ దంగ‌ల్‌: తెలుగు నేత‌ల‌ను మించిన బూతులు...?

Update: 2021-03-28 13:30 GMT
ఎన్నిక‌లు అన‌గానే రాజ‌కీయ వేడి స‌హ‌జ‌మే. అయితే.. ఒక‌ప్పుడు.. రాజ‌కీయంగా మాత్ర‌మే.. విధానాల ప‌రంగా మాత్ర‌మే.. ప్ర‌త్యర్థి పార్టీలు విమ‌ర్శ‌లు గుప్పించుకునేవి. కానీ.. మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు, స‌వాళ్లు మ‌న‌కు తెలిసిందే. ముందు రాజ‌కీయ వ్యూహంతో మొద‌లు పెట్టి.. వ్య‌క్తిగ‌త దాడులు.. విమ‌ర్శ‌ల వ‌ర‌కు కూడా రాజ‌కీయం ఎన్నిక‌ల స‌మ‌యంలో బ‌హుముఖంగా కొన‌సాగుతున్న విష‌యం అంద‌రికీ తెలుసు. ఇక‌, ఇప్పుడు ప‌శ్చిమ బెంగాల్ ‌లోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపిస్తోంది. పోక చెక్క‌తో నువ్వొక‌టంటే.. త‌లుపు చెక్క‌తో నే రెండంటా! అనే రీతిలో నాయ‌కులు విధానాల‌ను వ‌దిలేసి.. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల వైపు పావులు క‌దుపుతున్నారు.

తాజాగా ప్ర‌చారం.. ఇటు బీజేపీ.. అటు అధికార పార్టీ మ‌మ‌తా బెన‌ర్జీలు ఇద్ద‌రూ కూడా వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు తెర‌దీశారు. ప్ర‌ధాని మోడీపై విమర్శల వర్షం కురిపించారు. గడ్డాలు పెంచడం, స్టేడియాల పేర్లు మార్చడమే తప్ప పారిశ్రామిక అభివృద్ధి చేతకాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  ‘‘వారికి(బీజేపీ) రెండు సిండికేట్లు ఉన్నాయి. ఒకరు.. ఢిల్లీ, గుజరాత్‌, యూపీలో అల్లర్లు చెలరేగేందుకు ప్రోత్సహిస్తారు.. ఇక మరొకరు పారిశ్రామిక అభివృద్ధిని కుంటుపడేలా చేసి గడ్డం పెంచుతూ ఉంటారు.

ఒక్కోసారి.. గాంధీజీ, రవీంద్రనాథ్‌ ఠాగోర్‌ కంటే తానే గొప్ప వాడినని భావిస్తారు. మరోసారి తనను తాను స్వామి వివేకానంద అని చెప్పుకొంటారు. మైదానాలకు తన పేరు పెట్టుకుంటారు. ఏదో ఒకరోజు దేశానికే తన పేరు పెట్టుకుని, అమ్మేసినా అమ్మేస్తారు. నాకెందుకో వారి మెదడులోనే ఏదో సమస్య ఉందని అనిపిస్తుంది. బహుశా స్క్రూ లూజ్‌ అయి ఉంటుంది’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇక‌, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా అదే త‌ర‌హాలో విరుచుకుప‌డ్డారు. టీఎంసీ ప్రభుత్వ హయంలో ఆదివాసీల హక్కులు, భూముల హరణ జరిగిందని, గిరిజనుల భూములను లాక్కొని చొరబాటుదారులకు కట్టబెట్టారన్నారు. ఒక ప్రత్యేక వర్గాన్ని సంతోష పరచడం కోసం బెంగాల్లో ఉర్దూను బోధనామాధ్యమంగా చేయాలని మమత కోరుకుంటోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉపాధి కల్పన ఘోరంగా దెబ్బతిన్నదని, ఆటోమొబైల్‌ పరిశ్రమ ఎదగకుండా మమత అడ్డుపడ్డారని విమర్శించారు.

ప్రజాపయోగ పథకాలు కావాలంటే బీజేపీకి ఓటేయాలని కోరారు. అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జరిగిన బీజేపీ కార్యకర్తల హత్యలకు కారకులైనవారంతా ఊచలు లెక్కించక తప్పదని ప‌రోక్షంగా సీఎం మ‌మ‌త‌ను గ‌ట్టినే హెచ్చరించారు. మొత్తంగా చూస్తే.. బెంగాల్ ప్ర‌చారం విధానాల నుంచి వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల దిశ‌గా దూసుకుపోతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News