అణు ఇంధన వ్యాపారంలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన అమెరికాలోని వెస్టింగ్ హౌస్ సంస్థ మనుగడ సంక్షోభంలో పడింది. దాదాపు వెయ్యి కోట్ల డాలర్ల రుణభారంతో సతమతమవుతున్నట్లు ప్రకటిస్తూ న్యూయార్క్‌లోని కోర్టులో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. పరపతిదారుల నుంచి రక్షణ కల్పించాలని కోరింది. సంస్థల వ్యవహారాలను చక్కదిద్దుకునేందుకు తాత్కాలికంగా వెసులుబాటు కల్పించే చాప్టర్ 11కు బోర్డు ఆమోదం తెలిపింది. నష్టాలను పరిమితం చేసుకునేందుకు తోషిబా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ పరిణామం అణు ఇంధన పరిశ్రమకు గట్టి దెబ్బ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రపంచంలోని అణురియాక్టర్లలో దాదాపు సగభాగం వెస్టింగ్ హౌస్ టెక్నాలజీతో రూపొందినవే. తాజా పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే నిర్మితమవుతున్న, ఒప్పందాలు కుదుర్చుకోకున్న ప్రాజెక్టుల భవితవ్యం ఏమిటనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. రెండేళ్ల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ - నాటి అమెరికా అధ్యక్షుడు ఒబామా అణు రంగంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని అవగాహనకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఆరు అణురియాక్టర్ల నిర్మాణానికి 2017 జూన్ కల్లా ఒప్పందాలు ఖరారు చేసుకోవాలనుకున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఆరు అణు రియాక్టర్ల భవిష్యత్ అయోమయంలో చిక్కుకుంది. ఇప్పుడు ఆ ప్రాజెక్టుల భవితవ్యం ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.
వెస్టింగ్ హౌస్ ఎలక్ట్రిక్ కంపెనీ.. జపాన్ లోని తోషిబాకు చెందిన అమెరికన్ విభాగం. వైద్య పరికరాలు, గృహోపకరణ ఉత్పత్తులను అందించే జపాన్ సంస్థ తోషిబా 2006లో వెస్ట్ హౌసింగ్ తో జతకట్టింది. నాడు అణుశక్తి రంగంలో కొత్త శకాని కి నాంది పలుకుతామని ప్రకటించినా దశాబ్ది తర్వాత పరిస్థితి మారిపోయింది. గత డిసెంబర్ నుంచి షేర్ల విలువ సగానికి పైగా పడిపోయింది. జాప్యం, లెక్కల్లో తప్పులు అక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొంటూ కొత్తగా భారత్, బ్రిటన్ ప్రాజెక్టుల్లో భాగం పంచుకోనని తోషిబా ప్రకటించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/