కాంగ్రెస్ ఏం చేస్తోందో ఆ పార్టీ కి అర్థ‌మ‌వుతోందా?

Update: 2018-12-15 05:33 GMT
తెలంగాణ ఎన్నికల తర్వాత కొత్త రాష్ట్రం లో  రాజకీయాలు మహా స్పీడు గా ఉన్నాయి. ముందస్తు ఎన్నికల్లో తన జోరును పెంచి దూసుకుపోతోంది తెలంగాణ రాష్ట్ర సమితి. ఈ ఎన్నికల్లో మహాకూటమి గా ఏర్పడిన కాంగ్రెస్- తెలుగుదేశం- తెలంగాణ జన సమితి- సిపీఐ పార్టీలు తమకు వచ్చిన ఫలితాల నుంచి తేరుకున్నట్లుగా కనిపించడం లేదు.  తెలంగాణ ఎన్నికలకు ప్రకటన తో పాటు అభ్యర్ధుల ఎంపిక- ప్రచారం- చివరకు విజయం ఇలా అంశాల్లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి తన జోరు చూపించింది.

మహాకూటమి ఏర్పాటు కు రోజల తరబడి సమావేశాలు- ఢిల్లీ లో మంతనాలు-  సీట్ల పంపకాలు- పొత్తుల ఖరారు- అభ్యర్ధుల ఎంపిక ఇలా ప్రతి అంశంలోనూ మహాకూటమి వెనుకంజలోనే ఉంది. ఎన్నికలు ముగిసిన తర్వాత అధికార తెలంగాణ రాష్ట్ర సమితి తమ శాసనసభా నాయకుడి ని ఎన్నుకోవడంతో పాటు ప్రమాణ స్వీకారం కూడా పూర్తి చేసింది. అంతే కాదు... జాతీయ రాజకీయాలను శాసించే దిశగా పార్టీ పగ్గాలను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన కుమారుడు కల్వకుంట్ల తారక రామారావుకు అప్పగించారు. నాలుగైదు రోజుల్లో మంత్రివర్గ విస్తరణ కూడా పూర్తవుతుంది అంటున్నారు. దీని తర్వాత శాఖల పంపిణీ, బాధ్యతల స్వీకరణ వంటివి చకచకా జరిగిపోతున్నాయి.

యుద్ధంలో సొమ్మసిల్లిపోయిన ప్రతిపక్షాలు తమ ముందు ఏ లక్ష్యమూ లేక చతికిల పడిపోతున్నాయి. ఓటమి కి ఎవరిని బాధ్యులను చేయాలి, ఎవరిని దోషులుగా చేయాలనే అంశం పై తర్జనబర్జన పడుతున్నాయి. ఓటమిని హుందా గా అంగీకరించాల్సిన కాంగ్రెస్ ఓటమికి కారణాలు వెతికే పనిలో పడడం వారి కాంగ్రెస్ దీనస్థితిని తెలియజేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇచ్చారని అంద‌రూ అనుకుంటూ ఉంటే, దీనికి ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపించడం కూడా వింతగానే ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

ఎన్నికలకు ముందు తీసుకున్న అన్ని నిర్ణయాలు ప్రజా కూటమి కి వ్యతిరేకంగానే వచ్చాయని, దీనిని అర్ధం చేసుకోలేని ప్రజా కూటమి వైఫల్యాలు కప్పిపుచ్చుకుంటున్నారని రాజకీయ పండితులు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ తో పొత్తు పెట్టుకోవడం పై ముందుగా సరైన నిర్ణయం తీసుకోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ నిర్ణయాన్ని తప్పుగా భావించడం చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందమే అంటున్నారు. 


Tags:    

Similar News