మీది తెనాలి.. మాది తెనాలి మాటను గుర్తు చేసిన కేసీఆర్

Update: 2020-06-18 17:30 GMT
వాతావరణాన్ని వేడెక్కించటంలో సీఎం కేసీఆర్ కున్న ప్రావీణ్యం తెలిసిందే. సమయానికి తగ్గట్లు స్పందించటం.. తన మాటల చాతుర్యంతో అందరిని మంత్రముగ్దుల్ని చేసే గుణం తెలియంది కాదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిలో ఈ గుణం ఎంత ఎక్కువన్న విషయం తాజాగా ప్రధాని మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో మరోసారి వెలుగుచూసింది.

మరోసారి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తారన్న ఊహాగానాలు భారీ ఎత్తున సాగుతున్న వేళ.. దానిపై క్లారిటీ ఇవ్వాలని ప్రధాని మోడీని కోరిన కేసీఆర్ మాటలకు.. ఆయన విస్పష్టంగా విషయాన్ని తేల్చేశారు. రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో లాక్ డౌన్ ను విధించే అవకావం లేదని.. అన్ లాక్ 2.0 ఎలా అమలు చేయాలన్న దానిపైనే తామంతా చర్చించుకోవాలన్న విషయాన్ని చెప్పటం ద్వారా.. కేంద్రం మూడ్ ఏమిటో చెప్పేశారు.

ప్రధాని నోటి నుంచి ఈ మాట వచ్చినంతనే.. ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి ఆసక్తికర అంశం ఒకటి వచ్చింది. దేశంలో మామూలు జీవితం ప్రారంభం కానున్న వేళ.. ఎవరు ఎక్కడికైనా వెళ్లి పని చేసుకునే వెసులుబాటు కల్పించాలని కోరారు. వివిధ రాష్ట్రాల నుంచి కూలీలు..కార్మికులు.. హమాలీలు మళ్లీ పని చేసుకోవటానికి వివిధ రాష్ట్రాలకు వెళ్లటానికి సిద్ధమవుతున్నారని.. వారికి వెసులుబాటు ఉండేలా ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ కోరారు.

ఈ సందర్భంగా తెలంగాణకు వచ్చే బిహారీ హమాలీలను అక్కడి ముఖ్యమంత్రి నితీశ్ వారిస్తున్నారన్న వార్తల్ని ఈ సందర్భంగా సరదాగా ప్రస్తావించిన కేసీఆర్.. నితీశ్ జీ.. మేం తెలంగాణలో మీ హమాలీలను బాగా చూసుకుంటున్నాం. మా సీఎస్ కూడా మీ బిహార్ వారే. దయచేసి కూలీల్ని పంపాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వీడియో కాన్ఫరెన్సు వాతావరణాన్ని మరింత తేలిక చేసిందని చెప్పాలి. కేసీఆర్ మాటల్ని చూసినప్పుడు.. మీది తెనాలి.. మాది తెనాలి అన్న నానుడిని గుర్తుకు చేసేలా ఉండటం గమనార్హం. మొత్తానికి అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు.. తమ ప్రాంతాలకు చెందిన వారి విషయంలో మరింత కేర్ ఫుల్ గా ఉంటారన్న మాటను కేసీఆర్ చెప్పినట్లుగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News