రష్యా - ఉక్రెయిన్ మధ్య ఏమైంది? యుద్ధం వరకు ఎందుకు వెళుతోంది?

Update: 2022-01-25 23:30 GMT
ఉక్రెయిన్ లో ఏం జరుగుతోంది? రష్యాతో యుద్ధ మేఘాలు ఎందుకు కమ్ముకున్నాయి?లేదారష్యా - ఉక్రెయిన్ మధ్య  ‘వార్’ లొల్లికి అసలు కారణాలివే!

కొన్ని దశాబ్దాల క్రితం సోవియట్ యూనియన్ లో భాగం.. ప్రస్తుతం యూరోప్ యూనియన్ లో చేరిపోవాలన్న ఆత్రుత.. ఒకప్పుడు ప్రపంచానికి తిరుగులేని శక్తిగా మారాలని ఆశించి భంగపడి.. తీవ్రమైన పేదరికం నుంచి ఇప్పుడిప్పుడే బయటకొస్తున్న అత్యంత శక్తివంతమైన దేశం.. తన రక్షణ వ్యవస్థకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని భావించిన వేళ.. తన చెంతనే ఉన్న నీటి వనరుల్ని సొంతం చేసుకోవటంతో పాటు.. ఒకప్పుడు తనలో భాగమైన ప్రాంతాన్ని తిరిగి సొంతం చేసుకుంటే ఎలా ఉంటుందన్న ఒక బలవంతుడైన అధినేత ఆలోచన ప్రపంచానికి మరో యుద్ధాన్ని చూసే అవకాశాన్ని ఇస్తుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

గడిచిన రెండేళ్లుగా యావత్ ప్రపంచం కరోనా మహమ్మారి దెబ్బకు అతలాకుతలమైపోయింది. అప్పటివరకు ఎవరికి వారు దూసుకెళుతున్నవేళ.. సడన్ గా ఎంట్రీ ఇచ్చిన కరోనా.. రేపిన కల్లోలం ఇప్పటికి ఒక కొలిక్కి రాలేదు. ప్రస్తుతం ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మూడో వేవ్ తీవ్రత ఎక్కువగా ఉంటే..మరికొన్ని దేశాల్లో ఇప్పుడిప్పుడే కరోనా పడగ నీడ నుంచి బయటకు వస్తున్న వేళ.. రష్యా -ఉక్రెయిన్ దేశాల మధ్య మొదలైన ఉద్రిక్తత యుద్ధంగా మారుతుందన్న వార్తలు ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తున్నాయి.

ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయి.. ప్రపంచీకరణలో భాగంగా అందరూ అందరికి అవసరమనే పరిస్థితి ఉన్న వేళలో.. రష్యా -ఉక్రెయిన్ మధ్య యుద్ధం కానీ మొదలైతే.. దాని ప్రభావం అందరి మీదా పడే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచం మరో యుద్ధాన్ని ఎదుర్కొనే పరిస్థితుల్లో ఉందా? అన్నది ప్రశ్న. నేరుగా యుద్ధంలో పాలు పంచుకోకపోయినా.. ఒకసారి యుద్ధం మొదలైన తర్వాత సంబంధం లేని వారి మీదా దాని ప్రభావం ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదుఇంతకూ రష్యా -ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరిగేంత పంచాయితీ ఏముంది? అక్కడి దాకా విషయం ఎందుకు వెళ్లింది? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. పలు అంశాల్నిచెబుతుంటారు. అందులో ముఖ్యమైన వాదనల్ని చూస్తే..

30 ఏళ్ల క్రితం ఉక్రెయిన్ సోవియెట్ యూనియన్ లో భాగమన్న సంగతి తెలిసిందే. కమ్యునిజం కోట కుప్పకూలిన తర్వాత సోవియెట్ సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. యూనియన్ లోని దేశాలు తమకు తాము స్వతంత్య్రాన్ని ప్రకటించుకున్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి ఉక్రెయిన్. రష్యాతో పొడవాటి సరిహద్దు కలిగి ఉంది. విస్తీర్ణం ప్రకారం చూస్తే.. రష్యా తర్వాత ఐరోపాలో రెండో అతి పెద్ద దేశం. జనాభా పరంగా ఎనిమిదో దేశం. 8.13 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వీరిలో 17.3 శాతం మంది రష్యన్లే.

సోవియెట్ యూనియన్ పతనమయ్యాక రక్షణ.. అణ్వస్త్ర..క్షిపణి పరిశ్రమలు.. అపార ఖనిజ సంపద ఉక్రెయిన్ లో ఉండటంతో ఆ దేశం తమ మిత్రదేశంగా ఉండాలని రష్యా భావిస్తోంది. తమను తాము పాలించుకునే అవకాశం వచ్చినప్పటికి పాలనలో మాత్రం ఉక్రెయిన్ తడబడుతూనే వచ్చింది. యూరప్ తో సంబంధాలు పెంచుకోవాలని కొందరు అనుకుంటే.. మరికొందరు రష్యాతో తమ అనుబంధాన్ని కొనసాగించాలని వాదిస్తారు. ఇదే.. అసలు సమస్యకు కారణం.
2014లో ఉక్రెయిన్ అధ్యక్షుడిగా ఉన్న విక్టర్.. యూరప్ తో సంబంధాలు తెంచుకొని రష్యాతో బంధాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. ఇది కాస్తా విప్లవంగా మారింది. ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించే వారంతా కలిసి పోరాడటం చేయటంతో దేశాధ్యక్ష పదవి నుంచి విక్టర్ తొలగాల్సి వచ్చింది. తనతో కలిసి ప్రయాణించాలన్న దేశాధ్యక్షుడ్ని పదవీచ్యుతుడ్ని చేయటం రష్యాకు సహజంగానే నచ్చలేదు.
అందుకే.. ఉక్రెయిన్ లో భాగమైన క్రిమియాను ఆక్రమించింది. రష్యాతో పోలిస్తే ఉక్రెయిన్ పిల్లకాకి కావటం.. దాన్ని ఢీ కొట్టే శక్తి లేకపోవటం.. దీనికి తోడు రష్యా మీద ఏహ్యభావం ఉన్న వారి సంఖ్యను తాజా పరిణామం ఉక్రెయిన్ లో మరింత పెరిగేలా చేసింది. దీంతో.. రష్యాతో కంటే కూడా యూరోపియన్ యూనియన్ తో సంబంధాలు పెంచుకోవటంతో పాటు.. ఆ యూనియన్ లో భాగస్వామి కావాలన్న తపన పెరిగింది. దీనికి తగ్గట్లే 2024లో యూరోపియన్ యూనియన్ లో సభ్యత్వానికి దరఖాస్తు చేసుకోనున్నట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. అదే సమయంలో.. యూరోపియన్ యూనియన్ కు రక్షగా నిలిచే నాటో (అమెరికా నాయకత్వంలో నడిచే మిత్రపక్షాల కూటమి)లో చేరాలన్న కోరికను బయటపెట్టింది.

ఇవన్నీ రష్యాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఉక్రెయిన్ కానీ నాటో కూటమిలో చేరితే.. వాటి బలగాలు ఉక్రెయిన్ సరిహద్దుల్లో పాగా వేస్తే.. రష్యాను ఈజీగా టార్గెట్ చేసే వీలు ఉటుంది.. అందుకే.. ఉక్రెయిన్ నాటోలో చేరటానికి రష్యా ససేమిరా అంటోంది. అంతేకాదు.. ఉక్రెయిన్ అణ్వస్త్రరహిత దేశంగా ఉండాలని.. నాటోలో చేరొద్దని రష్యా కోరుతోంది. అయినా ఉక్రెయిన్ రష్యా కోరుకున్నట్లు చేయలేదు. అందుకే 2014లో ఉక్రెయిన్ లోని భాగమైన క్రిమియాను రష్యా ఆక్రమించింది. రెండోప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో ఒక దేశ భూభాగాన్ని మరో దేశం ఆక్రమించుకోవటం ఇదే తొలిసారిగా చెబుతారు. సెవొస్తోపోల్‌ ప్రాంతంలోనూ రష్యా అనుకూల ప్రభుత్వం నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో అమెరికా, నాటో దేశాలు ఉక్రెయిన్‌ రక్షణ కోసమని తమ సేనల్ని అక్కడ దించాయి.
ఉక్రెయిన్ - రష్యా వివాదంలో మరో కీలక ఇష్యూగా గ్యాస్ పైప్ లైన్ ను చెబుతారు. ష్యా నుంచి ఐరోపా దేశాలకు గ్యాస్‌, పెట్రోలు సరఫరా చేయాలంటే ఉక్రెయిన్‌ భూభాగం మీదుగా వేసిన పైపులైన్లే ఆధారం. ఇందుకోసం ఉక్రెయిన్‌కు రష్యా ఏటా మిలియన్ల డాలర్లు రాయల్టీగా చెల్లిస్తోంది. అయినప్పటికీ ఉక్రెయిన్‌ పాలకులు తరచూ ఈ పైపులైన్లను స్తంభింపజేస్తామని  బెదిరించటంతో రష్యా మరో ఆలోచన చేసింది. అందులో భాగంగా బాల్టిక్‌ సముద్రగర్భం గుండా పైపు లైన్ల నిర్మాణం మొదలెట్టింది. ఇప్పటికే ఆ నిర్మాణం జర్మనీ వరకు పూర్తి చేసింది.  ఫ్రాన్స్‌కు కూడా దీని ద్వారా ఇంధన సరఫరా చేస్తానని ప్రతిపాదించింది. ఇవన్నీ ఐరోపాలో రష్యాను తీవ్రంగా వ్యతిరేకించే దేశాలకు కంటగింపుగా మారింది.
రష్యాను తీవ్రంగా వ్యతిరేకించే జర్మనీయే ఇప్పుడా దేశంతో  గ్యాస్‌ సరఫరాపై ఒప్పందం కుదుర్చుకోవడం.. ఫ్రాన్స్‌ కూడా సుముఖంగా ఉండడంతో అమెరికా, బిట్రన్‌లలో, సోవియట్‌ మాజీ రిపబ్లిక్‌లలో ఆందోళన మొదలైంది. దీనికి తోడు జర్మనీ నేవీ చీఫ్‌  సైతం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు అనుకూలంగా చేసిన వ్యాఖ్యలు కలకలాన్ని రేపాయి. పుతిన్‌ మర్యాదస్తుడని.. ఆయన క్రిమియాను తిరిగివ్వరని.. ఉక్రెయిన్‌ ఆ ప్రాంతాన్ని తిరిగి సొంతం చేసుకునే అవకాశం లేదని చెప్పటం ఆందోళనగా మారింది.

ఉక్రెయిన్ కుగ్యాస్ రాయల్టీ రాకపోతే ఆ దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బ తినటం ఖాయమని.. అందుకే తాము ఆ దేశాన్ని ఆక్రమించుకుంటామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పుతిన విమర్శిస్తున్నారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో ఫోన్లో చర్చలు జరిపిన సందర్భంగా ఉక్రెయిన్ ను నాటోలో చేర్చుకోవద్దని చెప్పగా.. బైడెన్ అందుకు నో చెప్పారు. మళ్లీ ముఖాముఖి సమావేశం ఏర్పాటు కావాలని పుతిన్ కోరుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే అమెరికా జెట్ లు.. యుద్ధ నౌకలు ఉక్రెయిన్ లో దిగగా..  రష్యా సైతం అందుకు ధీటుగా లక్షకు పైగా సైనికుల్ని తన సరిహద్దుల్లోకి దించటంతో ఉక్రెయిన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది.
అయితే.. ఉక్రెయిన్ మీద యుద్ధంలో మరో కోణం ఉందని చెబుతారు. అదేమంటే.. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికాతో పాటు.. నాటో ఆంక్షల్ని అనుభవిస్తున్న రష్యా.. వాటి నుంచి బయటపడేందుకు ఉక్రెయిన్ ను పావులా వాడాలన్నది కూడా ఒక ప్లాన్ గా చెబుతుంటారు. ఉక్రెయిన్ తో పూర్తి స్థాయి యుద్ధం మొదలుపెట్టి.. దాన్ని ఆక్రమించుకుంటే ఉక్రెయిన్ పేరుతో నాటోదళాలు హడావుడి చేయటం తగ్గుతుంది. ఇదేమీ కాదంటే.. పూర్తి స్థాయి యుద్ధం పేరుతో హడావుడి చేస్తే.. యుద్ధ నివారణలో భాగంగా ఆంక్షల్ని తొలగిస్తారన్న ఆలోచనలో పుతిన ఉన్నారని చెబుతారు.

ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్ధ మేఘాల వెనుక నీటి వనరులు కూడా కారణంగా చెబుతారు. సోవియెట్ యూనియన్ సమయంలో డెనిపర్ నది ద్వారా కెనాల్ ఏర్పాటు చేసి క్రిమియాకు తాగునీటిని అందించేవారు. అంతేకాదు.. రష్యా వైమానిక స్థావరాలకు తాగునీటి అవసరాలు కూడా ఈ నదే చూసేది. ఎప్పుడైతే రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకుందో.. ఉక్రెయిన్ ఈ డెనిపర్ నది మీద ఆనకట్ట కట్టేసింది. దీంతో.. దిగువ ప్రాంతానికి నీటి సరఫరా తగ్గింది. దీంతో.. క్రిమియా.. రష్యా వైమానికి స్థావరాలకు నీటి సరఫరా కోసం రష్యా పెద్ద ఎత్తున ఖర్చుచేయాల్సి వస్తోంది. దీని నుంచి తప్పించుకోవాలంటే డెనిపర్ నదిపై కట్టిన ఆనకట్టపై అధిపత్యం సాధించాలని.. అందుకే ఉక్రెయిన్ తో రష్యా గొడవకు దిగినట్లుగా చెబుతున్నారు. ఇదంతా చూసినప్పుడు రష్యాకు ఉక్రెయిన్ కు మధ్యనున్న బోలెడన్ని పంచాయితీల్లో భాగంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని సరే.. మరి యుద్దం ముంచుకొచ్చేలా అమెరికా ఎందుకు వ్యవహరిస్తుందన్నది మరో ప్రశ్న. దీనికి సమాధానం వెతికితే.. కారనం చాలా సింఫుల్ అని చెబుతారు.

అదేమంటే.. ప్రపంచంలో ఎక్కడేం జరిగినా.. తన ప్రయోజనాల్ని చూసుకోవటం.. తన అధిక్యతను ప్రదర్శించటం కోసం దేనికైనా తెగబడటం అమెరికాకు అలవాటే. అందుకే.. ఉక్రెయిన్ విషయంలోనూ పెద్దన్న ప్రాత్రను పోషించటానికి అమెరికా విపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తోంది. సహజంగానే ఈ తీరు అమెరికాకు అస్సలు నచ్చదు.అవసరమైతే ఉక్రెయిన్ కు మిలటరీ సాయం చేసి రష్యా సంగతి చూడాలని అమెరికా భావిస్తోంది. దీంతో.. ఒకవైపు అమెరికా.. మరోవైపు రష్యాతో నలిగిపోతోంది ఉక్రెయిన్.
Tags:    

Similar News