ఢిల్లీలో ఏం జ‌రిగింది? ప‌వ‌న్ ఎందుకు దాస్తున్నారు?

Update: 2022-10-31 07:30 GMT
రాజ‌కీయాల్లో కొన్ని కొన్ని ర‌హ‌స్యాలు ఉంటాయి. కొన్ని కొన్ని ర‌హ‌స్యంగా జ‌రిగినా వాటిని పెద్ద‌గా దాచాల్సిన అవ‌స‌రం లేదు. కార్య‌క‌ర్త‌ల‌కు చెబితే మ‌రింత హుషారు వ‌స్తుంది. పైగా, అలాంటి విష‌యాల‌ను నేరుగా చెప్ప‌లేక పోయినా మ‌రో మార్గంలో అయినా చెప్పుకొంటేచాలు. ఇప్పుడు ఇలాంటి విష‌యంలోనే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మౌనంగా ఉన్నారు. ఇటీవ‌ల ఆయన విశాఖ‌లో ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ప్పుడు వివాదం ఏర్ప‌డింది. ఇది అధికార పార్టీతో వివాదానికి కూడా దారి తీసింది.జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌పై కేసుల వ‌ర‌కు కూడా వెళ్లింది.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ కోసం ప‌వన్ టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో చేతులు క‌లిపారు. ఇది అనూహ్య‌మైన ప‌రిణామ‌మ‌నే చెప్పాలి.అప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి లీకులు లేవు. క‌నీసం అనుకూల వ‌ర్గాల‌కు కూడా స‌మాచారం ఇవ్వ‌లేదు.

విజ‌య‌వాడ రావ‌డం.. ఆవెంట‌నే పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడ‌డం.. ఇది ముగిసిన త‌ర్వాత చంద్ర‌బాబు నేరుగా ప‌వ‌న్‌ను క‌ల‌వ‌డం జ‌రిగిపోయాయి. ఇద్ద‌రూ క‌లిసి ప‌నిచేయాల‌ని ఇది ఎన్నిక‌ల పొత్తు కాద‌ని కూడా స్ప‌ష్టం చేశారు. అయితే, ఇప్ప‌టికే జ‌న‌సేన‌తో పొత్తులో ఉన్నామ‌ని చెబుతున్న బీజేపీకి ఇది శ‌రాఘాతంగానే మారిద‌ని చెప్పాలి.

ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్‌ను హుటాహుటిన బీజేపీ పెద్ద‌లు ఢిల్లీకి పిలిపించారు. అక్క‌డ దాదాపు అర‌గంట‌కు పైగా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాతో ప‌వ‌న్ భేటీ అయ్యారు. దీనికిసంబంధించిన ఫొటోలు వ‌చ్చాయి. అయితే.. అధికారికంగా బీజేపీ కానీ, జ‌న‌సేన కానీ ఏమీ వెల్ల‌డించ‌క‌పోయినా.. ''మీరు తొంద‌ర ప‌డొద్దు. ఎప్పుడు ఏం చేయాలో మేం చూసుకుంటాం. మీ ఉద్య‌మాలు మీరు సాగించుకోండి. ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉంద‌''ని జేపీ న‌డ్డా చెప్పిన‌ట్టు లీకులు వ‌చ్చాయి. దీనిలోఎంత నిజం ఉందో తెలియ‌దు. దీంతో జ‌న‌సేన‌లో ప‌వ‌న్‌ఢిల్లీ టూర్ ఆస‌క్తిగా మారింది.

ఢిల్లీలో ఏం జ‌రిగింది?  టీడీపీతో పొత్తు ఉంటుందా?  ఉండ‌దా?  ఉద్య‌మాల విష‌యంలో ఎలా క‌లిసి వెళ్లాలి?  టీడీపీతో ఎలా స‌మ‌న్వ‌యం చేసుకోవాలి?  వంటి అనేక ప్ర‌శ్న‌లు జ‌న‌సేన నేత‌ల్లో దోబూచులాడుతూనే ఉన్నాయి. వీటికి ప‌వ‌న్ స‌మాధానం కూడా చెబుతార‌ని వారు అనుకున్నారు. ఆ స‌మ‌యం రానేవ‌చ్చింది. ఇప్పుడు జ‌న‌సేన పీఏసీ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి.

ఆదివారం తొలిరోజు అయింది. అయితే, ఈ స‌మావేశాల్లో ఎక్క‌డా ఢిల్లీలో ఏం జ‌రిగింది? అనే విష‌యాన్ని ప‌వ‌న్ చెప్ప‌లేదు. క‌నీసం ఆ ఊసు కూడా వినిపించ‌లేదు. అంతేకాదు.. ఇటీవ‌ల జ‌రిగిన విశాఖ ప‌రిణామాల‌పైఆయ‌న సుదీర్ఘంగా మాట్లాడినా, త‌ర్వాత చంద్ర‌బాబుతో చేతులు క‌లిపిన విష‌యాన్ని కూడా ప్ర‌స్తావించ‌లేదు. దీంతో ప‌వ‌న్ ఎందుకు ఈ కీల‌క విష‌యాలు దాస్తున్నార‌నే చ‌ర్చ జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News