ఎన్నిక‌ల్లో సీజ్ చేసిన డ‌బ్బు ఎక్క‌డుంది?

Update: 2018-10-27 13:33 GMT
పార్ల‌మెంటు - అసెంబ్లీ - ఎమ్మెల్సీ - స్థానిక సంస్థ‌లు - పంచాయ‌తీ....ఇలా ఏ ఎన్నిక‌లైనా దాదాపుగా అన్ని పార్టీలు....డ‌బ్బు  వెద‌జ‌ల్ల‌డం - మ‌ద్యం ఏరులుగా పారించ‌డం కామ‌న్. ఫ‌లానా నేత‌ల‌కు చెందిన వాహ‌నం నుంచి ఇన్ని కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు...అంత డ‌బ్బు దొరికింది...అంటూ వార్త‌లు వ‌స్తుంటాయి. అయితే, ప్ర‌తిసారీ ఎన్నిక‌ల్లో స్వాధీనం చేసుకున్న డ‌బ్బు ఏమ‌వుతోంది? అన్న విష‌యం మాత్రం ఎవ్వ‌రికీ తెలీదు. కొంత‌మంది స్వ‌చ్ఛంద సేవా సంస్థ‌ల వారు ఆ వివ‌రాల‌ను తెలుసుకునే ప్ర‌య‌త్నం చేసినా....ఆ కేసుల‌కు సంబంధించిన వివ‌రాలు బ‌ట్ట‌బ‌య‌లు కావు. తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈ వ్య‌వ‌హారం మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

2009 ఎన్నిక‌ల్లో అక్ర‌మ మ‌ద్యం - న‌గ‌దు ర‌వాణాకు సంబంధించి 2472 కేసులు న‌మోద‌య్యాయి.వాటిలో కేవ‌లం 298 కేసుల‌పై మాత్ర‌మే నామ‌మాత్ర‌పు పెనాల్టీలు విధించారు. మిగిలిన కేసుల‌న్నీ పెండింగ్ లోనే ఉన్నాయి. ఇక 2014 ఎన్నిక‌ల సంద‌ర్భంగా...దేశ‌వ్యాప్తంగా 334 కోట్ల రూపాయ‌ల‌ను,  2ల‌క్ష‌ల లీట‌ర్ల లిక్క‌ర్ ను సీజ్ చేశారు. అందులో 151 కోట్లు ఆంధ్ర ప్ర‌దేశ్ నుంచి సీజ్ చేయ‌డం విశేషం. ఆ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఏపీ - తెలంగాణ‌లో క‌లిపి 9867 కేసులు  న‌మోద‌య్యాయి. వాటి విచార‌ణ మాత్రం ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా ఉంది. స్వాధీనం చేసుకున్న డ‌బ్బు, మ‌ద్యం ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది ఎవ‌రికీ తెలియ‌ని మిస్ట‌రీగా మిగిలిపోయింది. వాటి వివ‌రాల‌ను కొంద‌రు సామాజిక కార్య‌క‌ర్త‌లు అడిగినా....ఇప్ప‌టివ‌ర‌కు అవి వెల్ల‌డికాలేదు. మ‌రి, రాబోయే ఎన్నిక‌ల్లో స్వాధీనం చేసుకోబోయే డ‌బ్బు...మ‌ద్యం ఎక్క‌డికి వెళుతుందో అన్న‌ది భేతాళ ప్ర‌శ్న‌!


Tags:    

Similar News