పవన్ లక్ష్యమేంటి?

Update: 2022-12-27 02:30 GMT
జనసేన పార్టీ అధినేత కోసం రూపొందిన వారాహి వాహనం పరిచయం ఏ స్థాయిలో జరిగిందో తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఎవ్వరికీ చెప్పాల్సిన పని లేదు. అయితే పవన్ తన యాత్రలో ఆ రథాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారనేదే సమాధానం లభించాల్సిన ప్రశ్న. మొదట్లో పవన్ రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు ఎంతో వ్యత్యాసం ఉంది. పవన్ విమర్శలకు వైసీపీ నాయకత్వం ఎలా స్పందిస్తున్నదే దీనికి కొలమానం.. పవన్ విమర్శలు చేసినప్పుడు అదే స్థాయిలో తిరిగి రిప్లై వచ్చినప్పుడు ఆటో మేటిక్ గా జనం చూపు వాళ్లపైనే ఉంటుంది.

ఇప్పుడు ఏపీలో ఇదే నడుస్తోంది. పవన్ ను టార్గెట్ చేసి చేస్తున్న విమర్శలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే రాజకీయాలే ప్రధానంగా వీరిమధ్య సాగుతున్న విమర్శనాస్త్రాలు ఏపీ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పవన్ మూడుపెళ్లిళ్ల ఘటనపై వైసీపీ విమర్శనాస్త్రాలు సంధిస్తుండగా అదే స్థాయిలో జనసేన పార్టీ నాయకత్వం తిప్పికొడుతోంది..  

- జనసేనతోనే వైసీపీ ఢీ...
పవన్ వర్సెస్ వైసీపీ అనేలా విమర్శనాస్త్రాలు కొనసాగుతున్నాయి. ఇవి పవన్ కల్యాణ్ కు చెడు చేసేవి మాత్రం కావన్నది నిజం. జనం నోట్లో ఏ పేర్లు ఎక్కువగా వినిపిస్తాయో వాళ్లే రాజకీయ ప్రత్యర్థులుగా కొనసాగుతారు. ఇప్పటి పరిస్థితులను బట్టి చూస్తుంటే ఏపీలోని మంత్రులంతా ముందు జన సేనాని టార్గెట్ చేసి మూడో వ్యక్తిగా చంద్రబాబు పేరు ప్రస్తావిస్తున్నారు. చివరకు కుప్పంలో కూడా ఓడిస్తామని ప్రచారం చేయడమే కాకుండా ఇప్పుడు తాజాగా మంత్రి అమర్నాథ్ చంద్రబాబును ప్రశ్నిస్తూ.. ఏ రాష్ట్రానికి ప్రతిపక్ష నేతవో అర్థం కావడం లేదని పల్లవి అందుకున్నారు.

అంటే చంద్రబాబు ఇమేజ్ ను డేమేజ్ చేస్తే ఆటోమేటిక్ గా పవన్ లీడ్ లోకి వస్తారు. ఎందుకంటే పవన్ విడిగా పోటీ చేయడమే వైసీపీకి కావాలి.. టీడీపీ ఓట్లు మళ్లీ పవన్ చీలిస్తే అధికార పార్టీ గెలుపు మరోసారి సునాయాసమవుతుంది. అదే టార్గెట్ తో జనసేనను ప్రముఖంగా చేసుకుని వైసీపీ విమర్శలు కొనసాగిస్తోంది. అయితే ఒకసారి తన బలం ఏమిటో గ్రహించిన పవన్ వెనుకడుగు వేయకుండా మరింత పుంజుకునేలా రాజకీయాలు నెరుపుతున్నారు.

- బహిరంగ ప్రకటనకు ఎందుకు ఆలస్యం..
ఒక వేళ ఏపీలో టీడీపీతో పొత్తుల విషయం ప్రస్తావనకు వస్తే కేవలం రెండు శాతం కూడా ఓటు బ్యాంకు లేని బీజేపీ మాటలు పవన్ వింటారా? 6.79 ఓటు బ్యాంకు ఉన్న పవన్ మాట బీజేపీ వింటుందా అనేది ప్రధాన ప్రశ్న.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలు ఇప్పటి వరకు ఒక ఎత్తు.. ఇక నుంచి మరో ఎత్తు అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో కనీస సంఖ్యలో 30 నియోజకవర్గాల్లోనైనా జనసేన పార్టీని గెలిపించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో రాజోలు మినహా మరో చోట ఎక్కడా తన ప్రాభవాన్ని చూపలేకపోయారు. టీడీపీతో కలిసి వెళ్తే మెరుగైన సీట్లు సాధించగల్గేవారిమంటూ అంతర్గతంగా ఎన్నో సార్లు మథనపడ్డారు.

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని 2024 ఎన్నికల్లో తెలుగుదేశం–జనసేన పార్టీలు పొత్తు పెట్టుకునేందుకు అవకాలు లేకపోలేదు. 2 శాతం కూడా ఓట్లు లేని బీజేపీని భరించేకంటే అధికార పార్టీని ఎదుర్కొనే శక్తి ఉన్న టీడీపీతో కలిసి వెళ్లడమే మేలని ఆయనమదిలో ఉన్న ఆలోచన.. అయితే ఎప్పటి నుంచో మిత్రపక్షంగా ఉన్న బీజేపీ బెట్టు చేస్తున్న కారణంగానే జనసేనాని బహిరంగంగా ప్రకటించడానికి కొంత వెనుకాడుతున్నారని తెలుస్తోంది.

- పొత్తులో కనీసం 30 అయినా గెలవాలి!
ఈ పొత్తులో భాగంగా కనీసం 30 సీట్లనైనా డిమాండ్ చేయాలని జనసేన పార్టీ యోచన.. కాపు సామాజిక వర్గంతో పాటు తమకు బలమున్న ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే ఎక్కవ సీట్లు డిమాండ్ చేయాలనే పవన్ ముందస్తు ఆలోచన... ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో అభిమానగణం మినహా మిగతా ఓట్లు దక్కించుకోవడం పవన్ కు కత్తిమీద సాము లాంటిది. అందుకే ఆంధ్రాల్లోని బలమున్న 30 సీట్లలో మాత్రం పోటీ చేసి నెగ్గించుకోవాలని జనసేన పార్టీ అధినేత భావిస్తున్నారు.

కనీసం 30 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే తన పార్టీకి గుర్తింపు లభిస్తుందని, భవిష్యత్ రాజకీయాల్లో నిలబడగలననే భావనలో సేనాని ఉన్నారు. ప్రస్తుతానికి చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు దొరకడమే గగనంగా మారిన జనసేన బలం పుంజుకోవడమే ప్రధాన ఎజెండాగా రాజకీయాలు చేయాల్సి ఉంది. దానికి ఈ వారాహి పునాది అని చెప్పుకోవచ్చు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News