బండి సంజయ్ విషయంలో వరంగల్ సీపీ ఏం చేయనున్నారు?

Update: 2023-04-05 16:05 GMT
హైదరాబాద్ నుంచి వరంగల్ సీపీగా వచ్చాక ఏవీ రంగనాథ్  మంచి పేరు సంపాదించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ గా అక్రమార్కులు, భూకబ్జాలు, బెదిరింపులపై  ఉక్కుపాదం మోపారు. నేరస్థులు ఎంతటి వారైనా ఆయన వదిలిపెట్టలేదు. నిర్ధాక్షిణ్యంగా కేసులు పెట్టి అరెస్ట్ చూపించారు. జైలుకు పంపించే వరకూ వదలలేదు.

అధికార బీఆర్ఎస్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను సైతం అరెస్ట్ చేసి అటు రాజకీయవర్గాలు, మీడియాలోనూ హైలెట్ అయ్యారు. న్యాయం చేయాలంటూ వచ్చిన వృద్ధులు, పేదల సమస్యలు పరిష్కరించి మంచి పేరు సంపాదించారు.

వరంగల్ సీపీగా అక్రమార్కులకు చుక్కలు చూపిస్తున్న రంగనాథ్ ఇప్పుడు ఈ పదోతరగతి పేపర్ లీకేజీ కేసును తవ్వి తీస్తున్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ  కేసులో మాజీ రిపోర్టర్ బూరం ప్రశాంత్ ను సైతం అరెస్ట్ చూపించి జర్నలిస్ట్ సంఘాల విజ్ఞప్తి చేసినా చట్టం ముందు అందరూ సమానులే అంటూ జర్నలిస్టులకు షాకిచ్చారు.

ఈ క్రమంలోనే వరంగల్ పరిధిలోని కమలాపూర్ లో పేపర్ల లీకేజీ వెలుగుచూసింది. ఈ మాజీ జర్నలిస్ట్ కం బీజేపీ కార్యకర్త ప్రశాంత్ ఈ పేపర్ లీకేజీని బండి సంజయ్ కు పంపి ఫోన్ లో సంభాషించినట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రశాంత్ ను అరెస్ట్ చేసి బండి సంజయ్ ను కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి వరంగల్ కు బండి సంజయ్ ను తరలించడంతో వరంగల్ సీపీ చర్యలపైనే ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.

ఇక ఈరోజు వరంగల్ సీపీ ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్టు ప్రకటించారు.ఇందులో బండి సంజయ్ అరెస్ట్ ను చూపిస్తారా? ఎలాంటి కేసులు పెట్టారు.? బండి సంజయ్ ప్రమేయం ఎంత అనేది ఆధారాలు చూపిస్తారా? కోర్టులో హాజరు పరుస్తారా? అన్నది ఉత్కంఠ రేపుతోంది.

అక్రమార్కుల విషయంలో అస్సలు వదలని సీపీ రంగనాథ్ కు ఇప్పుడు బండి సంజయ్ కేసు ఓ సవాల్ గా మారింది. ఆయన ఈ విషయంలో ఎలాంటి చర్యలు చేపడుతారన్నది ఉత్కంఠ రేపుతోంది.    


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News