కొత్త సచివాలయంలో సీఎం చాంబర్ ఎక్కడంటే?

Update: 2020-09-10 09:50 GMT
భారీగా ఉండటాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇష్టపడుతుంటారు. ఏం చేసినా.. అలా నిలిచిపోవాలి. అందరూ చెప్పుకోవాలన్నట్లుగా ఆయన తీరు ఉంటుంది. కేసీఆర్ కలల సౌధంగా చెప్పే కొత్త సచివాలయానికి సంబంధించిన కీలక పనులు వేగంగా సాగుతున్నాయి. పాత భవనాల్ని నేలమట్టం చేసి.. కొత్త భవనాల్ని ఏ రీతిలో నిర్మించాలన్న కసరత్తు పెద్ద ఎత్తు సాగుతోంది. ఇక.. అందరూ ఆసక్తిగా చూస్తున్న సీఎం చాంబర్ ఏ అంతస్తులో ఉండనుంది? ఎంత భారీగా ఉండనుందన్న విషయంపై తాజాగా స్పష్టత వచ్చినట్లే.

తాజాగా చెబుతున్న దాని ప్రకారం.. ముందు నుంచి అనుకున్నట్లే ఆరో అంతస్తులో సీఎం చాంబర్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కేసీఆర్ లక్కీ నెంబరు ఆరు కావటం మర్చిపోకూడదు. నిజానికి మొదట్లో సీఎం చాంబర్ ఏడో అంతస్తులో ఉంటుందన్న మాట వినిపించింది. తన లక్కీ నెంబరుకు భిన్నంగా ఏడో అంతస్తులో సీఎం చాంబర్ ను ఏర్పాటు చేయటానికి కేసీఆర్ ససేమిరా అంటారన్న అంచనాకు తగ్గట్లే.. తాజా నిర్ణయం ఉండటం గమనార్హం.

పర్యావరణ అనుమతుల కోసం రోడ్డు.. భవనాల శాఖకు సమర్పించిన ప్రతిపాదనల్లో పేర్కొన్న దాని ప్రకారం సీఎం చాంబర్ ఆరో అంతస్తులో ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 11 అంతస్తుల్లో భవనం ఉండనుంది. ఇందులో ఐదు అంతస్తుల్లో మంత్రులతో పాటు.. వివిధ కార్యదర్శులకు చాంబర్లను కేటాయిస్తారు.  మొదటి అంతస్తులో ఆర్థిక మంత్రి చాంబర్.. సాధారణ పరిపాలనా విభాగం ఉండనుంది.

ఏడో అంతస్తు నుంచి పదో అంతస్తు వరకు కమాండ్ కంట్రోల్ సెంటర్ లు.. మీటింగ్.. డైనింగ్ హల్స్ ఉంటాయి. ఇక.. పదకొండో అంతస్తులో 360 డిగ్రీల్లో స్కైలాంజ్ ఉండనుంది. గ్రీన్ బిల్డింగ్ పద్దతిలో నిర్మించే ఈ భవనం దక్కనీ.. కాకతీయ ఆర్క్ టెక్చర్ నమూనాలో నిర్మిస్తారు. పూర్తి వాస్తు ఆధారంగా ఈ భవనాన్ని నిర్మించనున్నారు. మొత్తం విస్తీర్ణంలో 20 శాతం మాత్రమే భవనాల్ని నిర్మిస్తారు. మొత్తం 26.29 ఎకరాల విస్తీర్ణం ఉండగా.. అందులో దగ్గర దగ్గర ఆరు ఎకరాల్లో మాత్రమే భవనాల్ని నిర్మిస్తారు. మిగిలినదంతా ల్యాండ్ స్కేపింగ్.. గ్రీనరీకే కేటాయించనున్నారు.

ఇక.. ముఖ్యమంత్రి చాంబర్ విషయానికి వస్తే..8156 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. అంటే.. ఒక మధ్యతరగతి జీవి నివసించే డబుల్ బెడ్రూల్ ప్లాట్ (సగటున 1000 చదరపు అడుగులు వేసుకుంటే) చొప్పున ఎనిమిది డబుల్ బెడ్రూం ప్లాట్లు కలిపితే ఎంత ఉంటుందో.. అంతగా సీఎం చాంబర్ ఉండనుంది. మొత్తం 11 అంతస్తుల్లో ఆరో అంతస్తు మరింత ఆధునాతనంగా నిర్మిస్తారని చెబుతున్నారు. సాధారణ ప్రజలకు తూర్పు వైపున ప్రధాన ద్వారం ఉంటే.. ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటు చేస్తారు. కొత్త భవనానికి వినియోగించే మొత్తం విద్యుతును సౌర విద్యుత్ వ్యవస్థ ద్వారానే తీసుకునేలా నిర్మిస్తున్నారు.
Tags:    

Similar News