గుంటూరులో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ - బీజేపీలతో పాటు లోకేశ్ - చంద్రబాబుల అవినీతిని టార్గెట్ చేసిన పవన్....సినిమాలలో వచ్చే ఆదాయం గురించి కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. జనసేన అభివృద్ధికి వ్యతిరేకం కాదని - తనకు పారిశ్రామిక అభివృద్ధి అంటే తెలుసునని అన్నారు. ఒక సినిమా పై పెట్టిన పెట్టుబడికి పదింతలు రాబడి వస్తుందని, తాను పారిశ్రామిక పెట్టుబడికి వ్యతిరేకం కాదని అన్నరా. ``నేను 100 కోట్లు పెట్టి సినిమా చేస్తే అది దాదాపు 1000 కోట్లు కలెక్ట్ చేస్తది....రకరకాలుగా... కానీ అది నాకు రాదు. డబ్బుకు అంత సర్క్యులేషన్ ఉంటుంది. ఈ మధ్యనే తెలుగు సినిమా ఒకటి ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేసిందో మీ అందరికీ తెలుసు`` అని పవన్ వ్యాఖ్యానించారు.
పెట్టుబడులు పెట్టాలని....దాని ద్వారానే ఉపాధి - ఉద్యోగాల కల్పన జరగాలని పవన్ అభిప్రాయపడ్డారు. తాను గత ఆరేళ్లలో రూ.75 కోట్లు సంపాదించి....రూ.25 కోట్లు పన్ను కట్టానని చెప్పారు. అయితే, తాను రూ.100 కోట్లు పెట్టుబడితో సినిమా చేస్తే దాదాపు రూ.1000 కోట్ల ఆదాయం వస్తుందని పవన్ చెప్పడం ఆశ్చర్యకరంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నారు. వేల కోట్లు వసూలు చేసిందని పవన్ బాహుబలిని ఉద్దేశించి నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. పోనీ, పవన్ చెప్పిన లెక్క బాహుబలి వరకు సరిపోయిందనుకుందాం. కానీ, పవన్ తాజా సినిమా ‘అజ్ఞాతవాసి’ నిర్మాతలకు - బయ్యర్లకు చేదు అనుభవాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.100 కోట్లు బడ్జెట్ తో నిర్మించిన ఆ సినిమా దాదాపు రూ.130 కోట్ల బిజినెస్ చేసింది. అయితే, థియేట్రికల్ రన్ ద్వారా రూ.60 కోట్లు వసూలయ్యాయి. మరి, ఇటువంటి సమయంలో తాను 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే 1000 కోట్లు వస్తాయని పవన్ అనడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. పవన్ గతంలో నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ - కాటమరాయుడు కూడా డిజాస్టర్ టాక్ తో నష్టాలను మిగిల్చాయన్న సంగతిని పవన్ గుర్తు పెట్టుకోవాలని - బాహుబలితో పవన్ పోల్చుకోవడం ఏమిటని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.