ట్రంప్ కంటే ముందు అభిశంసన ఎవరు? ఎంతమంది?

Update: 2021-01-15 04:13 GMT
క్యాపిటల్ హిల్ భవనం మీదకు దాడికి పురిగొల్పిన ఆరోపణలతో డొనాల్డ్ ట్రంప్ ను ప్రతినిధుల సభ అభిశంసించటం తెలిసిందే. దీంతో.. రెండుసార్లు అభిశంసనకు గురైన ఏకైక అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రలో నిలిచిపోయే చెత్త రికార్డును తన సొంతం చేసుకున్నారు. అమెరికా అధ్యక్ష పదవి నుంచి వీడిపోవటానికి పది రోజుల కంటే తక్కువ వ్యవధిలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవటం గమనార్హం. ట్రంప్ ను తొలగించటానికి 232 మంది సభ్యులు మద్దతు ఇచ్చారు.

ఇక.. ట్రంప్ కు ముందు అభిశంసన ఎదుర్కొన్న అధ్యక్షులు ముగ్గురు ఉన్నారు. వారిలో ఒకరు బిల్ క్లింటన్.. ఆండ్రూ జాన్సన్.. రిచర్డ్ నిక్సన్ లు ఉన్నారు. వీరిలో బిల్ క్లింటన్ ను.. ఆండ్రూ జాన్సన్ ను సెనెట్ నిర్దోషులుగా తేలిస్తే.. రిచర్డ్ నిక్సన్ మాత్రం ఓటింగ్ కు ముందు తన  పదవికి రాజీనామా చేశారు. అమెరికా అధ్యక్షుడిగా తొలిసారి అభిశంసన ఎదుర్కొన్న వారిలో 17వ అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్ ఉన్నారు. 1865లో అభిశంసన ఎదుర్కొన్నారు. ఒక్క ఓటు తేడాతో ఆయన గట్టెక్కారు.

అబ్రహాం లింకన్ హత్యకు గురైన సమయంలో.. ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆండ్రూ జాన్సన్ అధ్యక్షులయ్యారు. 1867లో పదవీకాల చట్టాన్ని ఉల్లంఘించిన ఆరోపణలతో అభిశంసన ఎదుర్కొన్నారు. 1868లో ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానాన్ని రిపబ్లికన్లు ప్రవేశపెడితే.. ఒక్క ఓటుతో ఆయన గట్టెక్కారు. అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొన్న రెండో అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ నిలిచారు.

మోనికా లెవెన్ స్కీ స్కాండల్ లో ఆయనీ అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. మోనికాతో వివాహేతర సంబంధం ఉందని రుజువులతో సహా దొరికినప్పటికీ.. న్యాయస్థానం ముందు తనతో ఎలాంటి సంబంధం లేదని అబద్ధం చెప్పాలంటూ క్లింటన్ ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారు. న్యాయస్థానం విచారణ అనంతరం సెనేట్ లో క్లింటన్ పై అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టగా.. మూడింట రెండోవంతు మెజార్టీ రాకపోవటంతో ఆయన అధ్యక్షుడిగా కొనసాగారు. రిచర్డ్ నిక్సన్ అమెరికా 37వ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1969 నుంచి 1974 వరకు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన హయాంలోనే వాటర్ గేట్ కుంభకోణం బయటకు వచ్చింది.

1974లో రిచర్డ్ నిక్సన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని.. న్యాయసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణలపై అభిశంసన ఎదుర్కొన్నారు. అయితే.. ఓటింగ్ జరగటానికి ముందే ఆయన తన పదవికి రాజీనామా చేయటంతో.. అభిశంసన తీర్మానం ఆమోదం పొందక ముందే.. పదవి నుంచి వైదొలిగారు.
Tags:    

Similar News