గాలి ద్వారా కరోనా వ్యాప్తి... స్పందించిన డ‌బ్ల్యూహెచ్‌‌వో !

Update: 2020-07-08 13:50 GMT
గాలిలోని సూక్ష్మ రేణువుల ద్వారా కూడా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని, ఇందుకు తమ వద్ద ఆధారాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థకు 32 దేశాలకు చెందిన 239 మంది పరిశోధకులు లేఖ రాసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ వ్యాప్తిపై ఈ మేరకు సిఫార్సులను సవరించాలని వారు కోరారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను చూప‌డంతో ఈ వాద‌న‌కు డ‌బ్ల్యుహెచ్ ‌వో మ‌ద్ద‌తు ప‌లికింది.

ఈ నేప‌ధ్యంలో కరోనా వైరస్ ‌కు సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేయాలని శాస్త్రవేత్తల బృందం డబ్ల్యూహెచ్ ‌వో ను కోరింది.డ‌బ్ల్యుహెచ్‌వోకు చెందిన కరోనా ఎపిడెమిక్ సాంకేతిక అధిపతి మరియా వాన్ కెర్ఖోవ్ మీడియాతో మాట్లాడుతూ వాయువు ద్వారా కూడా క‌రోనా వ్యాప్తి చెందుతుంద‌నే వాద‌న‌ను తిర‌స్క‌రించ‌లేమ‌ని తెలిపారు. ‌కాగా , గ‌తంలో క‌రోనా సోకిన వ్య‌క్తి ముక్కు, నోటి నుండి చిన్న బిందువుల ద్వారా వ్యాధి వ్యాప్తి చెందుతుందని, క‌రోనా బాధితులు తాకిన ఉపరితలాన్ని తాకడం ద్వారా వ్యాధి వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్ ‌వో తెలిపింది. అయితే కొంత‌మంది శాస్త్రవేత్తలు గాలిలో ఉన్న చిన్నపాటి కరోనా కణాల ద్వారా వ్యాధి వ్యాప్తి చెందుతుంద‌ని చెప్తూ, సంబంధిత‌ ఆధారాల‌ను డబ్ల్యూహెచ్‌వోకు స‌మ‌ర్పించారు. గాలి ద్వారా వైరస్‌‌ వ్యాప్తికి సంబంధించిన ఆధారాలను సేకరించి విశ్లేషించి దానిపై మరింత స్పష్టత ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని వివరించారు.
Tags:    

Similar News