న‌గ‌రిలో రోజాకు... ఈ సారి పోటీ ఎవ‌రో?

Update: 2018-02-11 10:34 GMT
టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు సొంత జిల్లా చిత్తూరుకు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌ - టీడీపీ తొలిత‌రం నేత గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు ఇటీవ‌లే అక‌స్మాత్తుగా క‌న్నుమూశారు. అనారోగ్యం కార‌ణంగా హైద‌రాబాదులోని కేర్ ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటూనే ఆయ‌న కన్నుమూశారు. మాజీ మంత్రిగా - ప్ర‌స్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా గాలిది పార్టీలో ప్ర‌త్యేకమైన స్థాన‌మే. వైరి వ‌ర్గాల‌పై త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డే గాలి... త‌న‌పైనే కాకుండా పార్టీపై ఎవ‌రు విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టినా.. వెనువెంట‌నే ప్ర‌త్య‌క్ష‌మైపోతారు. గాలి రంగంలోకి దిగారంటే... అవ‌త‌లి వైపు వారికి త‌డిసిపోవాల్సిందేనన్న వాద‌న కూడా లేక‌పోలేదు. అయితే గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు తాను బ‌తికున్న కాలంలో త‌న కుమారుల‌ను పెద్ద‌గా రాజ‌కీయాల్లోకి తేలేద‌నే చెప్పాలి. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి ఆర్కే రోజా చేతిలో న‌గ‌రిలో చిత్తు చిత్తుగా ఓడిన గాలి... అంతకుముందు అక్క‌డే రోజాను ఓ ప‌ర్యాయం ఓడించారు. అయితే మొన్న గాలి చ‌నిపోయే దాకా అస‌లు ఆయ‌న కుమారులు బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌ద‌నే చెప్పాలి. గాలికి ఇద్ద‌రు కుమారులున్నా... వారు ఎన్న‌డూ బ‌య‌ట‌కు వ‌చ్చిన సంద‌ర్భ‌మే లేద‌ని చెప్పాలి.

గ‌డ‌చిన ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ గాలితో పాటు ఆయ‌న కుమారులు కూడా ప్ర‌చారానికి వ‌చ్చినా.. వారిపై మీడియా ఫోకస్ అంత‌గా ప‌డ‌లేద‌నే చెప్పాలి. అయినా ఇప్పుడు గాలి కుమారుల గురించి ఎందుకంటారా? ఎందుకేమిటి?... గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు ప్ర‌స్తుతం పార్టీ ఎమ్మెల్సీగానే కాకుండా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీగా కూడా ఉన్నారు. మ‌రి గాలి చ‌నిపోతే... ఆ ప‌ద‌వులు ఖాళీ అయినట్టే క‌దా. మ‌రోవైపు 2019 ఎన్నిక‌లు మ‌రో ఏడాదిలో జ‌ర‌గ‌నున్నాయి. అంతేనా... ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రిగినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదన్న వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. అదే జ‌రిగితే... వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా లాంటి కీల‌క నేత‌పై బ‌రిలోకి దిగేందుకు టీడీపీ త‌ర‌ఫున ఎవ‌రు ముందుకు వస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌ర‌మే క‌దా. గాలి వార‌సులుగా ఆయ‌న‌కు ఇద్ద‌రు కుమారులున్నా...ఇద్ద‌రిలో ఎవ‌రు ఎంట్రీ ఇస్తార‌నేది ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారింద‌నే చెప్పాలి. రాజ‌కీయ అనుభవ లేమి కూడా గాలి కుమారుల‌ను బాగానే ఇబ్బంది పెట్టేలానే ఉంది. ఈ నేప‌థ్యంలో గాలి ప్రాతినిధ్యం వ‌హించిన స్థానానికి ఆయ‌న కుమారులనే ఇంచార్జీలుగా నియ‌మిస్తారా?  లేదంటే విప‌క్షం త‌ర‌ఫున రోజా లాంటి బ‌ల‌మైన నేత ఉన్న స్థానంగా దానిని ప‌రిగ‌ణించి పార్టీకి చెందిన ఇత‌ర సీనియ‌ర్ నేత‌ల‌ను చంద్ర‌బాబు రంగంలోకి దించుతారా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

2009 ఎన్నిక‌ల‌కు ప‌క్క‌న‌పెడితే.. 2014 ఎన్నికల్లో న‌గ‌రి పోరు రాష్ట్రవ్యాప్తంగా ఆస‌క్తి రేకెత్తించింది. వైసీపీ త‌ర‌ఫున రోజా - టీడీపీ త‌ర‌ఫున ఆ పార్టీ సీనియ‌ర్‌ గా ఉన్న గాలి బ‌రిలోకి దిగిన నేప‌థ్యంలో నువ్వా?  నేనా? అన్న రీతిలో సాగిన పోరు నిజంగానే రాష్ట్రవ్యాప్త దృష్టిని ఆక‌ర్షించింది. 2009లో ఓడినా...2014లో మాత్రం రోజా స‌త్తా చాటారు. టీడీపీ నేతగా బ‌రిలోకి దిగిన గాలిని మ‌ట్టి క‌రిపించేశారు. ఈ విజ‌యం ఒక్క గాలికే కాకుండా చంద్ర‌బాబుకు కూడా పెద్ద అప‌జ‌య‌మ‌నే చెప్పాలి. ఎందుకంటే... నిత్యం టీడీపీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ...  ఆ పార్టీ వ్య‌వ‌హార స‌ర‌ళిని తూర్పార‌బ‌ట్టే నేత‌గా పేరొందిన రోజా.. ఈ గెలుపుతో అసెంబ్లీలో అడుగు పెట్టారు. వెర‌సి గాలి ఓట‌మి... ఓ మంచి  ప్ర‌త్య‌ర్థిని బ‌రిలోకి దింపిన‌ట్లైంద‌న్న వాద‌న లేక‌పోలేదు. మ‌రి 2019 ఎన్నిక‌ల్లో గాలి కంటే బ‌ల‌మైన అభ్యర్థిని రంగంలోకి దించితే త‌ప్పించి... రోజాను అడ్డుకోవ‌డం సాధ్యం కాదు. మ‌రి అలాంటి నేత‌లు ఎవ‌ర‌న్న విష‌యాన్ని బాబు ఎప్పుడు తేలుస్తారో చూడాలి.
Tags:    

Similar News