ఆ దేశంలో మొదటి డోస్ కింద ఒక టీకా.. రెండో డోస్ కింద మరో టీకా ఇచ్చారెందుకు?

Update: 2021-05-14 14:30 GMT
ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ తో వచ్చినన్ని సమస్యలు.. సవాళ్లు అన్ని ఇన్ని కావు. వందేళ్లలో యావత్ ప్రపంచానికి.. మానవజాతి మొత్తాన్ని ఒకే సమయంలో ఇంతలా ప్రభావితం చేసిన ఉదంతం మరొకటి లేదనే చెప్పాలి. కొవిడ్ ను కంట్రోల్ చేయటంలో కొన్ని దేశాలు తప్పించి చాలావరకు దేశాలన్ని విఫలమయ్యాయనే చెప్పాలి. అగ్రరాజ్యాలతో పాటు.. సంపన్న దేశాలు సైతం దీని బారిన పడి కిందామీదా పడిన పరిస్థితి. కరోనాకు చెక్ పెట్టేందుకు తొలుత అనుసరించిన లాక్ డౌన్.. మాస్కులు పెట్టుకోవటం.. భౌతిక దూరం లాంటివి పక్కన పెడితే.. పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ చాలా దేశాల నుంచి కరోనా తీవ్రతను తగ్గించేందుకు సాయం చేశాయి.

వ్యాక్సిన్ అన్నంతనే రెండు డోసుల్లో ఇవ్వాల్సి రావటం.. ఒకేలాంటి వ్యాక్సిన్ తప్పనిసరి చెప్పటం తెలిసిందే. ఇందుకు భిన్నంగా ఒక దేశంలో రెండు డోసుల్ని వేర్వేరు వ్యాక్సిన్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా రెండు డోసులకు వేర్వేరు వ్యాక్సిన్లు తీసుకుంటే చాలా సమస్యలు తప్పవని అంటారు కదా? మరి.. ఒక దేశం మొత్తం అలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.. ఫ్రాన్స్ లో తొలి డోస్ కింద ఆస్ట్రాజెనెకా టీకా ఇచ్చారు. అయితే.. నలభై ఏళ్ల లోపు వారిలో ఈ టీకా వల్ల కొన్ని సమస్యలు వస్తున్నట్లుగా గుర్తించి.. నిషేధం విధించారు.

మరి.. వారికి ఇవ్వాల్సిన రెండో డోసు మాటేమిటి? అన్నది ప్రశ్నగా మారింది. దీంతో.. ప్రత్యామ్నాయంగా.. ఉన్నవాటిల్లో బెటర్ అనుకున్న ఫైజర్ టీకాను రెండో డోస్ గా ఇచ్చారు. ఈ సందర్భంగా.. రెండు డోసులకు రెండు వేర్వేరు టీకాల్ని ఇవ్వటం వల్ల ఏం జరుగుతుందన్న పరిశోధన కూడా చేపట్టారు. ఇలా మిక్స్‌డ్‌ డోస్‌ ఇవ్వటం వల్ల భద్రతకు సంబంధించిన సమస్యలు రాలేదు కానీ.. కొన్ని ఇబ్బందులు ఎదురైనట్లు గుర్తించారు.

ప్రస్తుతం టీకా కొరత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. రెండు డోసులు ఒకటే వేసుకోవటానికి బదులుగా.. వేర్వేరు టీకాలు వేసుకుంటే ఏమవుతుందన్న అంశంపైనా ప్రభుత్వాలు ఫోకస్ చేస్తున్నాయి. మిక్స్‌డ్‌ డోస్‌ తీసుకుంటే ఏమవుతుందన్న దానిపై ఆక్స్ ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు సైతం ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. తమ పరిశోధనల్లో భాగంగా ఆస్ట్రాజెనెకా టీకా మొదటిడోసు తీసుకున్న వారికి నాలుగు వారాలతర్వాత రెండో డోసుగా ఫైజర్ టీకా ఇచ్చారు. అదే సమయంలో మరికొందరికి మొదటి డోసు కింద ఫైజర్ టీకా.. రెండో డోసు కింద ఆస్ట్రాజెనెకా టీకా ఇచ్చారు.

టీకా ఏదైనా తీసుకున్నంతనే తలనొప్పి.. అలసట.. జ్వరం లాంటివి ఉండటం మామూలే. అయితే..మిక్స్‌డ్‌ డోస్‌  తీసుకున్న వారిలో ఇలాంటి లక్షణాలు మరింత ఎక్కువగా ఉన్నట్లుగా గుర్తించారు. ఒకే టీకా తీసుకున్న వారిలో మూడు శాతం మంది ఆలసటకు గురి కాగా.. మిక్స్‌డ్‌ డోస్‌ తీసుకున్న వారిలో మాత్రం పది శాతం మంది తీవ్ర ఆలసటకు గురైనట్లుగా గుర్తించారు. తొలుత ఈ పరిశోధన యూత్ మీద కాకుండా యాభై ఏళ్లు దాటిన వారిపై చేశారు. ప్రస్తుతానికి చిన్న ఇబ్బందులు ఎదురైనట్లు గుర్తించినా.. ఈ ప్రయోగంలో పాల్గొన్న వారిలో రోగ నిరోధక శక్తి ఏ మేరకు రియాక్టు అవుతుందన్న అంశంపై అవగాహనకు మాత్రం మరికొంత కాలం పడుతుందని చెబుతున్నారు.
Tags:    

Similar News