కేంద్ర మంత్రుల్ని కలిసే విషయం లో జగన్ ఎంపీల కు పరిమితులెందుకు?

Update: 2019-11-16 06:07 GMT
ఒకే విషయం మీద ఒక్కొక్కరూ ఒక్కోలా వ్యవహరించటం ఏ మాత్రం సరికాదు. ఇలాంటి వాటితో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదముంది. ఇలాంటి తప్పుల తో వచ్చే తల నొప్పులు అన్నిఇన్ని కావు. అందుకే.. మరింత అప్రమత్త తో ఉండేందుకు కొత్త మార్గ దర్శకాల్ని తెర మీదకు తీసుకొచ్చారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

ప్రభుత్వానిది తప్పు లేకున్నా తప్పుడు ప్రచారం తో తరచూ బురద జల్లే ప్రతి పక్షం.. ఎప్పుడూ అవకాశం వస్తుందా? అన్నట్లు ఎదురు చూసే కేంద్ర సర్కారు ఉన్న వేళ.. తప్పులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు వీలుగా కొన్ని విధానాల్ని పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేస్తున్నారు ఏపీ సీఎం. పార్టీ లైన్ ను ఎవరూ క్రాస్ చేయొద్దని.. పార్టీకి.. ప్రభుత్వానికి సంబంధించి వ్యాఖ్యలు చేసే సమయంలో వ్యక్తిగత అభిప్రాయాల్ని తెర మీదకు తీసుకు రాకూడదని స్పష్టం చేస్తున్నారు.

అంతే కాదు.. టీవీ చర్చల్లో పాల్గొనే వారిలో కొందరు తమ వ్యక్తిగత అభిప్రాయాల్ని చెప్పటాన్ని జగన్ తప్పు పడుతున్నారు. ప్రధాన మంత్రి మోడీ.. కేంద్ర మంత్రుల్ని కలిసేందుకు కొందరు ఎంపీలు చేస్తున్న ప్రయత్నాల్ని తప్పు పట్టిన జగన్.. అలాంటివి చేయొద్దని స్పష్టం చేశారు.
అందరూ ఒకే బాట లో నడవాల్సి ఉందని.. అందుకే.. కేంద్రమంత్రుల్ని కలవాలన్న ఆలోచనలో ఉన్న ఏ ఎంపీ అయినా.. పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయి రెడ్డి.. ఎంపీ మిథున్ రెడ్డి లను సంప్రదించి.. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాతే కేంద్ర మంత్రుల్ని కలవాలని స్పష్టం చేశారు.
అంతేకాదు.. ప్రధాని.. కేంద్ర మంత్రుల్ని కలిసే సమయంలో వెంట విజయసాయి రెడ్డి ఉండాలన్న కండీషన్ ను జగన్ పెట్టినట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వ విధానాల తో పాటు పార్టీ లైన్ ను క్రాస్ చేయకుండా ఉండేందుకు.. తప్పులు దొర్లకుండా ఉండేందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. చుట్టూ తోడేళ్లు కాచుకొని ఉన్న వేళలో.. ఈ మాత్రం అప్రమత్తత అత్యంత అవసరమని చెప్పక తప్పదు.


Tags:    

Similar News