గన్నవరం పై బాబు ఎందుకు ఫోకస్ పెట్టడం లేదు

Update: 2020-02-10 04:25 GMT
గన్నవరం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఈ స్థానంలో టీడీపీ ఐదుసార్లు అసెంబ్లీ సీటును దక్కించుకుంది. 2019 ఎన్నికల్లో ఉధృతంగా వీచిన ఫ్యాన్ గాలిని కూడా తట్టుకొని గన్నవరంలో టీడీపీ నిలబడింది. అయితే కిందటి ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఝలక్ ఇచ్చాడు. వైసీపీ 151 సీట్లను గెలుచుకొని అధికారం చేపట్టిన అనంతరం టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ కి జై కొట్టాడు. అయితే అధికారికంగా వైసీపీ లో చేరలేదు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ పార్టీకి నష్టం కలిగించే పనులు చేస్తున్నారు.

చంద్రబాబు నాయుడు అధికారం లో ఉన్నప్పుడు కూడా గన్నవరం పై ఫోకస్ పెట్టినట్టు కన్పించడం లేదు. టీడీపీ ఎమ్మెల్యే ఆరేళ్లుగా గన్నవరంలో ఉన్న సొంతంగా పార్టీ కార్యాలయం కూడా నిర్మించుకోలేదు. సొంతంగా వంశీ ఓ కార్యాలయం ఏర్పాటు చేసుకొని తన పనులకు వాడుకునేవాడు. ఇది ప్రస్తుతం పార్టీకి నష్టం కలిగింది. అయినప్పటికీ వంశీ టీడీపీ రాజీనామా చేసి వెళ్లినా ఆయన వెంట పెద్దగా క్యాడర్ వెళ్లలేదని ధీమాతో చంద్రబాబు ఉన్నాడు. టీడీపీ ఇప్పటికీ గన్నవరం లో బలంగా ఉందని అక్కడి నేతలు అధినేత చెబుతున్నారు. అయితే టీడీపీ అధినేత గన్నవరం లో ఇప్పటికీ ఇన్ ఛార్జులను నియమించక పోవడంలో అంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. త్వరలో స్థానిక ఎన్నికలు వస్తున్న తరుణంలో పార్టీని బలోపేతం చేయాల్సిన చంద్రబాబు నాయుడు ఏమి పట్టించుకోక పోవడం ఏంటని పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఇన్ చార్జ్ నియామకం పై నాన్చుడు ధోరణి..
విజయవాడ ఎమ్మెల్యే గద్దె రాంమ్మోహన్ భార్య గద్దె అనురాధ ఇన్ చార్జి పదవీ కోసం పోటీ పడుతున్నారు. ఆమె కృష్ణా జిల్లా మాజీ జడ్పీ చైర్ పర్సన్ గా టీడీపీకి సేవలందించారు. రాంమోహన్ రావుది గన్నవరం కావడం. ఆయన గతంలో ఇక్కడి నుంచే ఇండిపెండెంట్ పోటీ చేసి గెలుపొందాడు. దీంతో ఆయనకు స్థానికంగా మంచి పట్టు ఉంది. ఆయన భార్య గన్నవరం నుంచి పోటీ చేసి జడ్పీ చైర్ పర్సన్ పదవీ పొందారు. స్థానికంగా ఆమెకు పలుకుబడి ఉండటంతో అనురాధకు జిల్లా ఇన్ చార్జి పదవీ దక్కుతుందని ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా మరోనేత పుట్టగుంట సతీష్ ఈ పదవీ కోసం పోటీ పడుతున్నాడు. గన్నవరంలో వంశీని ఢీకొనేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరికి పదవీ దక్కుతుందని కార్యకర్తలు భావిస్తున్నారు. అయితే టీడీపీ అధిష్టానం నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది. గన్నవరం నియోజకవర్గంపై బాబు మార్క్ రాజకీయం పని చేయడం లేదా అనే ప్రశ్న సాధారణ కార్యకర్తల్లో తలెత్తుతోంది.

గన్నవరంపై చంద్రబాబు తటపటాయింపు..
గుంటూరు వెస్ట్ టీడీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాడి గిరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన వెంటనే టీడీపీ అధినేత అక్కడ నియోజకవర్గ ఇన్ చార్జిని నియమించా పార్టీని చక్కదిద్దే పనిలో పడ్డారు. అయితే గన్నవరం లో వల్లభనేని వంశీ రెబల్ గా మారి నెలలు గడుస్తున్నా గన్నవరంలో నియోజకవర్గ ఇన్ చార్జిని నియమించడం లేదు. ఇన్ చార్జులుగా తాము చేస్తామంటూ ముందుకు వస్తున్న నేతలను చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదు. ఓ వైపు స్థానిక ఎన్నికలు ముందుకొస్తున్న తరుణంలో బాబు నాన్చుడి ధోరణితో పార్టీ నష్ట పోయేలా కన్పిస్తుంది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే వెళ్లిపోవడంతో ఢీలా పడిన పార్టీని చంద్రబాబు జాప్యంతో మరింత డీలా పడేలా చేస్తున్నాడని కార్యకర్తలు వాపోతున్నారు. చంద్రబాబు త్వరగా గన్నవరం లో నియోజకర్గ ఇన్ చార్జిని నియమించకపోతే పార్టీ దెబ్బతినడం ఖాయమని పలువురు నేతలు స్పష్టం చేస్తున్నారు. మరీ చంద్రబాబు గన్నవరంలో ఎలాంటి స్టెప్పు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.


Tags:    

Similar News