హ‌రీశ్‌.. కూర‌లో క‌రివేపాకు అయ్యారా?

Update: 2019-02-14 06:10 GMT
అస‌లోడికి ప‌ట్ట‌న‌ప్పుడు కొస‌రోడికి ఏం ప‌డుతుంది చెప్పండి. తాజాగా తెలంగాణ అధికార‌ప‌క్షంలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు ఇదే రీతిలో క‌నిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్య‌మం ప్రారంభం నుంచి మేన‌మామ కేసీఆర్ ప‌క్క‌నే ఉంటూ.. ఆయ‌న‌కు చేదోడువాదోడుగా ఉన్న హ‌రీశ్ అంద‌రికి సుప‌రిచిత‌మే. కేటీఆర్ ఎంట్రీతో హ‌రీశ్ ప్రాధాన్య‌త ఏ మాత్రం త‌గ్గ‌న‌ప్ప‌టికీ.. త‌ర్వాతి రోజుల్లో అంత‌ర్గతంగా ఆధిప‌త్య పోరు న‌డిచిన ప‌రిస్థితి.

తెలంగాణ సాధ‌న‌తో జెయింట్ గా మారిన కేసీఆర్ ఇమేజ్ తో.. కేటీఆర్ ఆయ‌న రాజ‌కీయ వార‌సుడిగా మార‌టం.. దానికి అంద‌రి ఆమోదం ప‌లికే ప‌రిస్థితి. మేన‌మామ మీద ఉండే ప్రేమ‌.. అభిమానం.. త‌న‌ను ఇంత స్థాయికి తెచ్చిన ఆయ‌న ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా ఓకే అనే ఒద్దిక హ‌రీశ్ లో కాస్తంత ఎక్కువే. మ‌న‌సులో బాధ ఉన్నా.. దాన్ని బ‌య‌ట‌కు రానివ్వ‌కుండా చూసుకోవ‌టం.. అలాంటివేళ‌లోనూ ఏదైనా బాధ్య‌త‌ను అప్ప‌గిస్తే..దాని అంతు చూసి రావ‌టం హ‌రీశ్ గుణాలు.

మ‌రి.. ఇలాంటి విధేయుడి విష‌యంలో కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఏ మాత్రం బాగోలేద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఒక‌ప్పుడు కేసీఆర్ కు అత్యంత స‌న్నిహితుడిగా.. ఆయ‌న త‌ల‌లో నాలుక‌లా మెలిగిన హ‌రీశ్ .. ఇప్పుడు కూర‌లో క‌రివేపాకుగా మారార‌న్న మాట వినిపిస్తోంది. ఎన్నిక‌ల్లో గెలుపు త‌ర్వాత నుంచి హ‌రీశ్ ప్రాధాన్య‌త అంత‌కంత‌కూ త‌గ్గించ‌టం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. తెలంగాణ తొలి ప్ర‌భుత్వంలో ఇరిగేష‌న్ మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన హ‌రీశ్ కు.. ఇప్పడు ఆ బాధ్య‌త‌ల్ని అప్ప‌గించ‌క‌పోవ‌ట‌మే కాదు.. వాటికి సంబంధించిన ప‌నులు కేసీఆరే స్వ‌యంగా చూసుకోవ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. మ‌రోవైపు జ‌గ్గారెడ్డి లాంటి నేత‌లు కేసీఆర్ ను పొగిడేయ‌టం కొత్త ప‌రిణామం. అంత‌కు మించిన మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. కేసీఆర్ ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తేస్తున్న జ‌గ్గారెడ్డి.. హ‌రీశ్ ను ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా తిట్టేయ‌టం వెనుక మ‌ర్మం ఏమిట‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. తాజా ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో కాంగ్రెస్ కు స‌మీపకాలంలో ఫ్యూచ‌ర్ లేని నేప‌థ్యంలో కేసీఆర్ కు ద‌గ్గ‌ర‌య్యేందుకు.. ఆయ‌న మ‌న‌సు దోచుకునేందుకు హ‌రీశ్ ను విమ‌ర్శించ‌ట‌మో.. ఆయ‌న్ను త‌ప్పు ప‌ట్ట‌టమో చేస్తే తెలంగాణ రాష్ట్రాధినేత కంట్లో ప‌డొచ్చ‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అస‌లోడికే కూర‌లో క‌రివేపాకులా మారినోడు.. కొస‌రోడికి ఎలా క‌నిపిస్తారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మేముంది?  రానున్న రోజుల్లో ఇలాంటివి మరెన్ని క‌నిపిస్తాయో?
Tags:    

Similar News