అసలు ఎందుకు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారెందుకో తెలుసా?

Update: 2020-04-07 15:21 GMT
కరోనా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లో చాలానే మార్పుల్ని తీసుకొచ్చింది. మూణ్నెళ్లకు.. నాలుగైదు నెలలకు మాత్రమే మీడియాతో మాట్లాడే ఆయన.. ఇటీవల రెండు రోజులకోసారి మీడియా మీట్ పెట్టేశారు. కరోనా అప్డేట్స్ ను ఆయనే స్వయంగా చెప్పేటోళ్లు. కీలక పరిణామాలు వరుసగా చోటు చేసుకుంటున్న వేళ.. ఆయనీ పని చేసేవారు. కాస్త గ్యాప్ తర్వాత సోమవారం రాత్రివేళ మరో ప్రెస్ మీట్ పెట్టారు. నిజానికి నిన్నటి మీడియా సమావేశాన్ని చూసినప్పుడు ప్రత్యేక కారణమంటూ ఏమీ కనిపించదు. అలాంటప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినట్లు? అన్నది ప్రశ్న. దీనికి సమాధానం వెతికితే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.

లాక్ డౌన్ విధించిన 21 రోజుల గడువు ఈ నెల 14తో ముగియనుంది. నిన్న ఏప్రిల్ ఆరు. అంతే మరో వారంలో లాక్ డౌన్ ఎత్తేయాల్సి ఉంది. జైల్లో ఉన్నోడు తన విడుదల తేదీ దగ్గరకు వస్తుంటే ఎంత ఆత్రంగా ఎదురుచూస్తుంటారో.. సరిగ్గా అలాంటి పరిస్థితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంది. ప్రజలు ఎప్పుడెప్పుడు వీధుల్లోకి వచ్చేద్దామా? తమకు అలవాటైన రోటీన్ లైఫ్ లోకి వెళ్లి పోదామా? అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి అంచనాలు అంతకంతకూ పెరిగితే కష్టమన్న విషయాన్ని గుర్తించారు సీఎం కేసీఆర్. అంతేకాదు.. ఎవరో ఒకరు వాస్తవాన్ని చెప్పాల్సిన బాధ్యత ఉందని గ్రహించారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో మొదట అనుకున్నట్లుగా లాక్ డౌన్ ను ఎత్తేసే పరిస్థితి లేదు. తబ్లీగీ జమాతే సదస్సు అనంతరం.. దేశ వ్యాప్తంగా వందలాది మంది వెళ్లటం.. వారి కారణంగా వ్యాధి విస్తరించటమే కాదు.. పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చేయాలంటే లాక్ డౌన్ మినహా మరో మార్గం లేదు. అందుకే.. ప్రజల్లో మొగ్గ తొడుగుతున్న ఆశల్ని తుంచేస్తూ.. కరోనా మీద యుద్ధం అంత తేలికైన సంగతి కాదని.. సుదీర్ఘ పోరాటం అవసరమన్న విషయాన్ని తన తాజా మీడియా సమావేశంతో తేల్చేశారు.
మిగిలిన అధినేతలకు కేసీఆర్ కు తేడా ఉంది. ఆయన చెప్పే మాటలు ఊళ్లో ఒక సాదాసీదా వ్యక్తి మొదలు ఒక పెద్ద సంస్థ సీఈవో సైతం కన్వీన్స్ అయ్యేలా చెప్పే సత్తా ఆయన సొంతం. తనకున్న టాలెంట్ ను ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్లో ప్రదర్శించటంతో పాటు.. లాక్ డౌన్ ను పొడిగించాల్సిన అవసరాన్ని ప్రజలకు మరింత బాగా అర్థమయ్యేలా చేయటమే కాదు.. మానసికంగా ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత తన మీద ఉందన్న విషయాన్ని గుర్తించారు. అందుకే.. ప్రెస్ మీట్ పెట్టారు. గడిచిన మూడు రోజులతో పోలిస్తే.. సోమవారం పెద్దగా కేసులు నమోదైంది లేదు. మరణాలు లేవు. అయినా ఎందుకు పెట్టారంటే.. ప్రజల మైండ్ సెట్ లో పొడిగింపు విత్తనాన్ని నాటటం ద్వారా.. అనవసరమైన అశలు పెంచుకోకుండా ఉండాలన్నదే ఆయన ఆలోచనగా చెప్పకతప్పదు.
Tags:    

Similar News