భార‌త్‌ తో వాణిజ్యం క‌ట్‌..పాక్‌ కు న‌ష్ట‌మా? లాభ‌మా?

Update: 2019-08-23 14:21 GMT
జమ్మూ-కశ్మీరు కు ప్రత్యేక అధికారాలను కల్పిస్తున్న భారత దేశ రాజ్యాంగంలోని అధికరణ 370 రద్దు - ఆ రాష్ట్రాన్ని విభజించడంపై ఓ రేంజ్‌ లో గింజుకుంటున్న పాకిస్థాన్ ఇందులో భాగంగానే సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన జాతీయ భద్రతా కమిటీ సమావేశమై పలు అంశాల మీద చర్చించి భారతదేశంతో వాణిజ్య సంబంధాల రద్దుకు నిర్ణయించుకుంది. అయితే, ఈ నిర్ణ‌యం వెనుక ఎవ‌రికి లాభం - ఎవ‌రికి న‌ష్ట‌మ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న గ‌ణాంకాల‌ను గ‌మ‌నిస్తే - భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే వాణిజ్య ఎగుమతులు-దిగుమతులు ఆయా దేశాల మొత్తం వాణిజ్యంతో పోలిస్తే చాలా తక్కువ. ఐక్యరాజ్య సమితి - ప్రపంచ వాణిజ్య సంస్థలతో కలిసి పనిచేసే అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం(ఐటీసీ) ప్ర‌కారం - 2018లో పాకిస్తాన్ నుంచి భారత్ ఎగుమతి అయిన వస్తువుల విలువ 38.3 కోట్ల అమెరికన్ డాలర్లు(అంటే సుమారు రూ. 2,730 కోట్లు). కానీ, అది పాకిస్తాన్ మొత్తం వాణిజ్యంలో రెండు శాతం మాత్రమే.భారత్ నుంచి పాకిస్తాన్‌ కు జరిగిన ఎగుమతుల విలువ 2.06 బిలియన్ అమెరికా డాలర్లు ( అంటే సుమారు రూ. 14500 కోట్లు) ఇది భారత్ నుంచి జరిగే ఎగుమతుల్లో 0.1 శాతమే. ఇంత అత్య‌త్ప స్థాయిలో రెండు దేశాల మ‌ధ్య లావాదేవీలు జ‌రుగుతున్నాయి.

భారత్ నుంచి చాలా వస్తువులు పాకిస్తాన్  దిగుమతి చేసుకుంటుండ‌గా వాటిలో అన్నిటికంటే పత్తి కీలకమైనది. 2018లో పాకిస్తాన్ సుమారు 46.6 కోట్ల డాలర్ల(రూ. 3322 కోట్ల) విలువైన పత్తిని భారత్ నుంచి దిగుమతి చేసుకుంది. పాకిస్తాన్ భారత్ నుంచి చర్మ పరిశ్రమ - రంగుల పరిశ్రమల కోసం ఇతర రసాయనాలు కూడా దిగుమతి చేసుకుంటోంది. భార‌త్‌-పాకిస్తాన్ మధ్య వాణిజ్య సంబంధాలు ఆగిపోవడం వల్ల పాకిస్తాన్ వస్త్ర పరిశ్రమకు చాలా నష్టం జరుగుతుందని వ్యాపార‌వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.  పాకిస్తాన్ నుంచి భారత్‌కు ఎగుమతి అయ్యే వస్తువుల్లో సిమెంట్ - సున్నపురాయి - ఉప్పు - సల్ఫర్ ఇతర ఖనిజాలు ప్ర‌ధాన‌మైన‌వి. భారత్‌ కు ఈ ఖనిజాల ఎగుమతి వల్ల పాకిస్తాన్‌ లో స్థానిక పరిశ్రమలు - వాణిజ్యం అభివృద్ధి చెందింది. తాజాగా పాక్ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యంతో...పాక్ కంపెనీల‌కే న‌ష్ట‌మ‌ని తేల్చిచెప్తున్నారు.  డ్రై ఫ్రూట్స్ - సిట్రస్ ఫ్రూట్స్ - పుచ్చకాయలు సైతం పాక్ నుంచి దిగుమ‌తి చేసుకుంటోంది.


Tags:    

Similar News