విజ‌య‌మ్మ‌.. షర్మిల‌ను కూడా సీబీఐ పిలుస్తుందా?

Update: 2022-03-04 11:30 GMT
వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ‌.. సీబీఐ.. దూకుడు పెంచిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే చాలా మందిని విచారించి.. కొంద‌రిని జైలు పాలు కూడా చేసిన సీబీఐ... వివేకా కుటుంబ స‌భ్యుల‌ను ఆయ‌న కారు డ్రైవ‌ర్‌, స్నేహితులు, వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుల‌ను కూడా విచారించి.. వాంగ్మూలాల‌ను కూడా న‌మోదు చేసింది. వైఎస్ వివేకా కుమార్తె, భార్య‌, అల్లుడుల‌ను కూడా విచారించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో.. ఇప్పుడు వివేకా హ‌త్య‌ను ఎవ‌రు చేశారు? ఎందుకు చేశారు? ఎలా జ‌రిగింది ? అనే విష‌యాల‌పై సీబీఐ మ‌రింత‌గా దృష్టి పెట్టింది.

ఏకంగా.. సీబీఐ డీజీనే క‌డ‌ప‌లో మ‌కాం వేశారు. కీల‌క‌మైన నాయ‌కులు, వైఎస్ కుటుంబ స‌భ్యుల‌ను కూడా విచారించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు వార‌త్లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన విచార‌ణ లు.. వాంగ్మూలాల‌ను గ‌మ‌నిస్తే.. దీని వెనుక చాలా మంది పెద్ద‌లు ఉన్నార‌నే విష‌యం తెలిసిపోయింది. ఈ క్ర‌మంలో దీనిని మ‌రింత లోతుగా విచారించి.. అప్పుడు ఇవ్వాల‌ని.. సీబీఐ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక‌, వివేకా కుమార్తె.. సునీతారెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో అనేక మందిని పేర్కొన్నారు. దీంతో వీరిని కూడా పూర్తిగా విచారించే అవ‌కాశం ఉంది.

అయితే.. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌రిగిన వివేకా హ‌త్య‌పై అప్ప‌ట్లో వైఎస్ జ‌గ‌న్‌, ఆయ‌న మాతృమూర్తి, వివేకా వ‌దిన విజ‌య‌మ్మ‌కానీ, జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల కానీ.. ఈ విష‌యాన్ని టీడీపీ మీద నెట్టేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనేజ‌గ‌న్ మీడియా నారా సుర ర‌క్త చ‌రిత్ర అంటూ.. పెద్ద ఎత్తున పుంఖాను పుంఖాలుగా క‌థ‌నాలను వండి వార్చింది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఈ కేసును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని ద‌ర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు ఈ కోణంలోనూ విచార‌ణ చేస్తారేమో.. అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ఏ పుట్ట‌లో ఏపాముందో.. అన్న‌ట్టుగా.. ఎవ‌రు ఏం చెబుతారో.. అని సీబీఐ కూడా ఆస‌క్తిగా ఉంది.

అంతేకాదు, పులివెందుల‌లో వైఎస్ కుటుంబం అతిపెద్ద కుటుంబం. సో.. వివేకా హ‌త్య పై కుటుంబంలో నూ అనేక చ‌ర్చ‌లు జ‌రిగి ఉంటాయి. ఈ నేప‌థ్యంలో వారిని కూడా విచారిస్తే.. బాగుంటుంద‌నే భావ‌న సీబీఐకి ఉండే అవ‌కాశం ఉంద‌ని మేధావి వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇదే క‌నుక జ‌రిగితే.. ఈ కేసులో పెద్ద మ‌లుపు తిరిగిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, ప్ర‌జ‌లు కూడా ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే.. ఒక‌వైపు వైసీపీ నేత‌లు..(ప్ర‌బుత్వ పెద్ద‌లు) ఏకంగా వివేకా అల్లుడిపై అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌రోవైపు.. వివేకా కుమార్తె సునీత‌.. ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయ‌న తండ్రిపై అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ మీద కూడా వైసీపీ నాయ‌కులు, వైఎస్ కుటుంబంలోని కీల‌క వ్య‌క్తులు ఆరోప‌ణ‌లు చేశారు. దీంతో ఈ కేసు.. అనేక మ‌లుపులు తిరిగింది. ఈ నేప‌థ్యంలో చూస్తే.. వైఎస్ విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల‌ను కూడా సీబీఐ పిలిచే అవ‌కాశం ఉంద‌ని కొంద‌రు అంటుంటే.. ఇంత అవ‌కాశం లేద‌ని.. ఒక వేళ ఉన్నా.. చాలా త‌క్కువేన‌ని కొంద‌రు చెబుతున్నారు.  ఈ విష‌యంపై సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాలుగా చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి చివ‌ర‌కు ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News