సొంత గూటికి వచ్చేస్తున్న డీఎస్?

Update: 2021-10-15 04:46 GMT
సీనియర్ రాజకీయ నేత.. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు.. సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో పని చేసిన ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డీఎస్ మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చేయనున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటు ఉన్న ఆయన.. ఆ మధ్యలో టీఆర్ఎస్ లో చేరటం తెలిసిందే. గులాబీ పార్టీలో చేరిన తర్వాత ఆయనకు రాజ్యసభ స్థానానికి ఎంపికైనప్పటికీ.. పార్టీలో మాత్రం ఆయనకు పెద్ద ప్రాధాన్యత లేకుండా ఉండటం తెలిసిందే.

దీనిపై ఆయన గడిచిన కొంతకాలంగా గుర్రుగా ఉన్నారు. సమయాన్ని చూసుకొని బదులు తీర్చుకోవాలన్న పట్టుదలతో ఉన్న ఆయన.. ఏపార్టీ వైపు వెళ్లాలన్న దానిపై గడిచిన కొంతకాలంగా మధనం చేస్తున్నారు. ఒకదశలో ఆయన బీజేపీలోకి చేరుతారన్న వాదన వినిపించినా.. ఆయన వెళ్లలేదు. మళ్లీ కాంగ్రెస్ కు వస్తారన్న ప్రచారం సాగినా.. అలాంటిదేమీ లేకుండా సాగింది.

ఇదిలా ఉంటే.. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డీఎస్ ను ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ను పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. దీనికి డీఎస్ సైతం సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు మంత్రిగా వ్యవహరించిన డీఎస్.. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగారు. 2009 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. 2014లో డీఎస్ ఇంటికి సీఎం హోదాలో స్వయంగా వెళ్లిన కేసీఆర్.. ఆయన్ను టీఆర్ఎస్ లోకి చేరాలని కోరటం.. అందుకు ఓకే చెప్పటం తెలిసిందే. రాజ్యసభకు పంపిన ఆయనకు పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లభించలేదు.

ఇదిలా ఉంటే.. 2019లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో డీఎస్ కుమారుడు అర్వింద్.. కేసీఆర్ కుమార్తె కవితపై పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఫలితం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలో డీఎస్ సైతం బీజేపీలోకి చేరతారన్న ప్రచారం సాగినా.. అలాంటిదేమీ జరగలేదు. తాజాగా మాత్రం.. రేవంత్ ఇంటికి రావటం.. ఆయన నుంచి పార్టీలో చేరాలన్న ఆహ్వానం రావటంతో ఆయనసముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. రానున్న రోజుల్లో డీఎస్ కాంగ్రెస్ లోకి జాయిన్ కావటం ఖాయమన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. అదే జరిగితే.. గులాబీ పార్టీకి ఇబ్బందికర పరిణామంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.




Tags:    

Similar News