కేసీయార్ ఫెడరల్ ఫ్రంట్...జగన్ కూడానా...?

Update: 2022-01-13 00:30 GMT
దేశ రాజకీయాల్లో తెలుగు వారు ప్రముఖ పాత్ర నిర్వహించడం అన్నది ఇప్పటిది కాదు, ఎన్టీయార్ కాలం నుంచి కొనసాగుతున్నదే. అప్పట్లో అన్నగారు ఇలా ఉమ్మడి ఏపీకి సీఎం అయ్యారో లేదో అలా జాతీయ పార్టీలను అన్నిటినీ విజయవాడ తీసుకువచ్చి మరీ మహానాడు వేళ భారీ మీటింగ్ పెట్టారు. అది అంతకంతకు పెరిగి 1989లో నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి రావడానికి దోహదపడింది. జాతీయ రాజకీయాల్లో ఎన్టీయార్ ఇంకా రాణించేవారే. ఆ మాటకు వస్తే ఆయన బతికి ఉండి ఆయన పదవి కోల్పోకపోతే కచ్చితంగా 1996లో దేశానికి ప్రధాని అయ్యేవారే.

ఇక ఎన్టీయార్ తరువాత చంద్రబాబు కూడా చాన్నాళ్ళు జాతీయ రాజకీయాల్లో వెలుగు వెలిగారు. ఆయన యునైటెడ్ ఫ్రంట్ అని పెట్టారు. దేవేగౌడ, గుజ్రాల్ దాని తరఫున ప్రధానులు అయ్యారు. ఇక 1999 తరువాత ప్రధానిగా వాజ్ పేయ్ కి మద్దతు ఇచ్చి దేశంలో కీలకమైన పాత్ర చంద్రబాబు పోషించారు.

ఇపుడు చూస్తే కేసీయార్ వంతు వచ్చినట్లుగా ఉంది. నిజానికి చాలాకాలం క్రితమే కేసీయార్ జాతీయం వైపు ఒక చూపు చూశారు. 2018లో ఆయన రెండవమారు ముఖ్యమంత్రి కాగానే ఫెడరల్ ఫ్రంట్ పేరిట కొంత హడావుడి చేశారు. అయితే 2019 ఎన్నికల్లో దేశంలో బీజేపీ రెండవసారి అధికారంలోకి రావడంతో తగ్గిపోయారు. ఇపుడు మళ్ళీ కేసీయార్ చూపు హస్తిన వైపు పడింది అంటున్నారు.

దానికి అనేక కారణాలు ఉన్నాయి. దేశంలో మునుపటిలా బీజేపీ బలం లేదు. మోడీ క్రేజ్ కూడా బాగా తగ్గుతోంది. ఇంకో వైపు కాంగ్రెస్ అనుకున్నంతగా పుంజుకోవడంలేదు. ప్రాంతీయ పార్టీల హవా అంతకంతకు పెరుగుతోంది. దాంతో మళ్లీ ఫెడరల్ ఫ్రంట్ పేరిట చురుకు పుట్టించాలని కేసీయార్ చూస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఈ మధ్యనే ఆయన తమిళనాడు వెళ్ళినపుడు డీఎంకే అధినేత స్టాలిన్ ని కలిశారు. ఇక లేటెస్ట్ గా చూసుకుంటే సీపీఎం సీపీఐ జాతీయ నేతలతో కేసీయార్ తన నివాసంలో  భేటీ వేశారు. ఇక తాజాగా బీహార్ కి చెందిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కేసీయార్ తో భేటీ అయ్యారు. ఈ ఇద్దరూ మాట్లాడుతూండగానే లాలూ ప్రసాద్ యాదవ్ కూడా కేసీయార్ కి ఫోన్ చేసి జాతీయ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించాలని కోరినట్లుగా వార్తలు వచ్చాయి.

దాంతో కేసీయార్ మళ్లీ దూకుడు చేస్తారు అంటున్నారు. ఆయన ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం కూడా చేపడతారు అని చెబుతున్నారు. హిందీ బాగా వచ్చిన నేత కావడంతో కేసీయార్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే అది ప్లస్ పాయింట్ గా ఉంటుంది అంటున్నారు. ఇక ఏపీలో జగన్ తో కేసీయార్ కి మంచి సంబంధాలు ఉన్నాయి. దాంతో ఫెడరల్ ఫ్రంట్ అంటూ కేసీయార్ పెడితే జగన్ కూడా అందులో చేరుతారా అన్న చర్చ కూడా ఉంది.

ఏది ఏమైనా కాంగ్రెస్, బీజేపీ లేని మూడవ కూటమి కేంద్రంలో అధికారంలోకి రావాలని కేసీయార్ తపిస్తున్నారు. దాని కోసం ఆయన సరైన ముహూర్తం చూసుకుని జాతీయ రాజకీయాల్లో తన మార్క్ ని చూపిస్తారు అంటున్నారు. బహుశా ఉత్తారాది ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత కేసీయార్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది. మొత్తానికి కేసీయార్ కి జాతీయ స్థాయిలో ఇపుడు కొంత అనుకూల వాతావరణమే ఉందని అంటున్నారు. చూడాలి మరి.
Tags:    

Similar News