టీడీపీని ఎన్టీఆరే కాపాడగలరా?

Update: 2020-02-24 04:56 GMT
టీడీపీ అధినేత చంద్రబాబు వయసు అయిపోయింది. మహా అయితే ఇంకో ఐదేళ్లు పనిచేస్తాడేమో.. 2023 ఎన్నికల నాటికి మరింత ఏజ్ ముదురుతుంది. మరి ఆయన వారసుడు లోకేష్ బాబుపై టీడీపీలోనే కాదు ఎవ్వరికీ అంత నమ్మకం లేదు. మరి టీడీపీ భావి వారసుడు ఎవరు.. అంత పెద్ద తెలుగు పార్టీ అంతర్థానమేనా? ఇప్పుడు ఇవే భయాలు టీడీపీ నేతలు కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నాయట.. అందుకే భవిష్యత్ దృష్ట్యానే ఇప్పుడు టీడీపీ శ్రేణులు.. పార్టీ వ్యవస్థాపకుడు అన్న నందమూరి ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ ను మళ్లీ పార్టీలోకి తీసుకురావడానికి డిమాండ్ చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.

జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకురావాలని చంద్రబాబు పిలుపునివ్వాలని, అతడి చరిష్మాను పార్టీ ఉపయోగించుకోవాలని టీడీపీలోని పలువురు సీనియర్లు సూచిస్తుండడం చంద్రబాబు, లోకేష్ కు మింగుడుపడడం లేదు. ఎన్టీఆర్ రాకపోతే ఏపీలో టీడీపీ క్షీణించడం ఖాయమని హెచ్చరికలు చేస్తుండడం విశేషం.

అయితే, ఎన్టీఆర్ ను టీడీపీ లోకి తీసుకునే విషయం లో చంద్రబాబు ఏమాత్రం ఆసక్తి గా లేడని. ఈ ఆలోచన ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు టీడీపీ ముఖ్యులు అభిప్రాయ పడుతున్నారు. వైయస్ జగన్ చేతిలో ఘోర పరాజయం పాలైన నేపథ్యం లో తొమ్మిది నెలల క్రితం ఎన్‌టిఆర్‌ రావాలని అందరూ కోరారు. గత రెండేళ్ల లో చంద్రబాబు నాయుడు చేసిన వ్యూహాలన్నీ దెబ్బ తిన్నాయి. చంద్రబాబు పని అయి పోయిందని శ్రేణులు బహిరంగంగా అంగీకరిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా టిడిపికి దూరమై ఇప్పుడు బిజెపితో పొత్తు పెట్టుకుంటున్నారు. పార్టీపై లోకేష్ బాబు ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్నందున పార్టీలోని సీనియర్లు కూడా చంద్రబాబుకు దూరంగా ఉన్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో పార్టీని విజయానికి నడిపించే సత్తా లోకేష్‌కు లేదని వారు భావిస్తున్నారు.

కాబట్టి, టీడీపీ భవిష్యత్ దృష్ట్యా ఎన్‌టిఆర్‌ను త్వరగా టీడీపీలోకి తీసుకురావాలని టీడీపీ శ్రేణులు కోరుతున్నాయి. అప్పుడే పార్టీ బాగు పడుతుందని అంటున్నారు. మోడీ-షాలను గత ఎన్నికల్లో వ్యతిరేకించిన చంద్రబాబును ఇప్పటికే బీజేపీ ఇరుకున పెట్టేప్రయత్నం చేస్తోంది. ఈ కోవలోనే ఎన్టీఆర్ ను దించితే చంద్రబాబు కను మరుగు కావడం ఖాయమని.. టీడీపీలో నాయకత్వ మార్పునకు బీజేపీ కూడా సహకరించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.


Tags:    

Similar News