రఘురామ రాజీనామా చేసేస్తారా ?

Update: 2021-08-24 04:40 GMT
వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజు తాజాగా చేసిన వ్యాఖ్యలు చూసిన తర్వాత అందరిలో ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతు తాను, జగన్మోహన్ రెడ్డి నరసాపురంలో పోటీ చేస్తే ఎవరికి ఎక్కువ ఓట్లొస్తాయనే విషయంలో తాను ఇన్టర్యాక్టివ్ వాయిస్ రికార్డింగ్ సిస్టమ్(ఐవీఆర్ఎస్) పద్దతిలో సర్వే చేయించినట్లు చెప్పారు. జగన్ కన్నా తనకే 19 శాతం అధికంగా ఓట్లు వచ్చినట్లు చెప్పుకున్నారు.

మరి ఐఆర్ఎస్ పద్ధతిలో ఎప్పుడు సర్వే చేయించారు, ఎవరు సర్వే చేశారనే విషయాన్ని మాత్రం రఘురామ చెప్పలేదు. అసలు జగన్ నరసాపురంలో రఘురామ మీద ఎందుకు పోటీ చేస్తారని సర్వే చేయించారో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. పోనీ ఇదే విషయాన్ని ఉల్టాగా జగన్ మీద రఘురామ పులివెందులలోనో లేకపోతే వైసీపీ అభ్యర్థి మీద కడప ఎంపీగా తాను పోటీ చేస్తే ఎలాగుంటుందనే విషయమై సర్వే చేయిస్తే బాగుండేది.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 50 సీట్లు కూడా రావని తేలిందట. ఎంఎల్ఏల్లో చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రబాబునాయుడుకు 60 శాతం పాజిటివిటీ వస్తుందని తేలిందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో వైసీపీ ఎంఎల్ఏలపై జరిగిన సర్వేలో ఒక్క భీమవరం ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ కు మాత్రమే పాజిటివిటి ఉందని తేలిందట. మరి ఆమధ్య ఏదో విషయంలో జనసేన అధినేత పవన్ మాట్లాడుతు వచ్చే ఎన్నికల్లో గ్రంధి శ్రీనివాస్ ను ఓడించి తీరుతానని చేసిన శపథం నెరవేరేట్లులేదు.

సరే వైసీపీకి ఎన్ని సీట్లు వస్తుందో లెక్కచెప్పిన తిరుగుబాటు ఎంపి మరి టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయో కూడా లెక్కచెప్పుంటే బాగుండేది. బీజేపీ+జనసేన పరిస్ధితి ఏమిటో చెప్పలేదు. నరసాపురంలోనే కాకుండా రాష్ట్రం మొత్తంమీద ఎంపి సర్వే చేయించినట్లే ఉంది చూస్తుంటే. మరలాంటపుడు ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో కూడా చెప్పుంటే బాగుండేది. మొత్తంమీద రఘురామ చెప్పదలచుకున్నదేమంటే జగన్ కన్నా తనకే ఎక్కువ పాపులారిటి ఉందని.

సర్వే ఫలితమే నిజమైతే మరి వెంటనే ఎంపి పదవికి రాజీనామా చేసేసి మళ్ళీ ఉపఎన్నికల్లో పోటీ చేసి గెలవచ్చుకదా. ఎంపి చేయించిన సర్వేప్రకారం వైసీపీ ఎలాగూ గెలవదు. అలాంటపుడు తాను ప్రతిపక్షాల ఉమ్మడిఅభ్యర్ధిగా ఇండిపెండెంట్ గానో లేకపోతే టీడీపీ, బీజేపీలో ఏదో పార్టీనుండి పోటీచేసి గెలిస్తే వైసీపీతో అసలిక రచ్చే ఉండదుకదా. నరసాపురం ఉపఎన్నికల్లో రఘురామ గెలిస్తే జాతీయస్ధాయిలో హీరో అయిపోతారు. మరి బంగారంలాంటి అవకాశాన్ని రఘురామ ఎందుకు దూరం చేసుకుంటున్నారో అర్ధం కావటంలేదు.
Tags:    

Similar News