ఆ క్రికెటర్ 'లంక' ను తేల్చేనా?

Update: 2022-08-10 23:30 GMT
ఒకప్పటి శ్రీలంక డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ సనత్‌ జయసూర్య గురించి తెలియనివారు లేరు. 1996 వరల్డ్‌ కప్‌లో అండర్‌ డాగ్‌గా బరిలోకి దిగిన శ్రీలంక వరల్డ్‌ కప్‌ను ఎగరేసుకుపోవడంలో జయసూర్యదే కీలక పాత్ర.

ఆ వరల్డ్‌ కప్‌లో లంక తరఫున ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగిన జయసూర్య బౌలర్లను ఊచకోత కోశాడు. ఆ వరల్డ్‌ కప్‌ భారతీయులకు ఒక పీడకలగా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. ఎందుకంటే భారత్‌.. సెమీఫైనల్లో శ్రీలంక చేతిలోనే ఓటమి పాలైంది.

కాగా మరోమారు జయసూర్య వార్తల్లోకెక్కాడు. అప్పులపాలై, కోవిడ్‌తో ఆర్థిక పరిస్థితి దిగజారి, పర్యాటకం పడకేసి అన్ని విధాలా సంక్షోభంలోకి జారిపోయింది.. శ్రీలంక. సాటి పొరుగు దేశంగా, పెద్దన్నగా ఇండియానే శ్రీలంకకు ఆపన్నహస్తం అందించింది. ఈ నేపథ్యంలో పర్యాటకానికి మరోమారు ఊపు తేవడానికి శ్రీలంక ప్రభుత్వం సనత్‌ జయసూర్యను శ్రీలంక టూరిజం బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో జయసూర్య కొలంబోలోని భారత హైకమిషనర్‌ గోపాల్‌ బాగ్లేతో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో భారతదేశం, శ్రీలంకల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం, ఆర్థిక పునరుద్ధరణకు ఒక సాధనంగా పర్యాటకాన్ని ప్రోత్సహించడంపై చర్చలు జరిగాయి.
శ్రీలంకలో 2.5 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఆ దేశ ఆదాయానికి ప్రధాన వనరు.. పర్యాటకమే. 3 మిలియన్ల మంది ప్రజలు పర్యాటకంపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే గత రెండేళ్లు కోవిడ్‌తో ఆ దేశానికి వెళ్లే పర్యాటకులు ఆగిపోయారు. ఆ దేశానికి వెళ్లే పర్యాటకుల్లోనూ భారతీయులే అత్యధికం.

బౌద్ధాన్ని అవలంభిస్తున్న అతికొద్ది దేశాల్లో శ్రీలంక ఒకటి. అలాగే రామాయణంలో పేర్కొనబడ్డ అనేక ప్రదేశాలను దర్శించడానికి భారతీయులు పెద్ద సంఖ్యలో శ్రీలంక వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో జయసూర్యను టూరిజం బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించడంతో పర్యాటకానికి కొత్త ఊపు వస్తుందని భావిస్తున్నారు.

కాగా 2022 ప్రారంభం నుంచి శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ దేశంలో 5.7 మిలియన్ల మందికి ‘తక్షణ మానవతా సహాయం అవసరం‘ అని ఐక్యరాజ్యసమితి పేర్కొనడం ఆ దేశ సంక్షోభ స్థితికి నిదర్శనం.
Tags:    

Similar News