ఉప పోరులో ఒక గ్రామానికి సీఎం ఇంఛార్జిగా ఉండటమా?

Update: 2022-10-21 04:25 GMT
బలాన్ని చూపించుకోవాలన్న తొందరలో తమ బలహీనతల్ని.. భయాల్ని బయటపెట్టేస్తుంటారు కొందరు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా గులాబీ బాస్ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఇదే తీరులో ఉందన్న మాట వినిపిస్తోంది. ఈ ఉప పోరును తమ పార్టీ ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందన్న విషయాన్ని అందరికి స్పష్టం చేసే క్రమంలో..

ఎప్పుడు లేని ఒక నిర్ణయాన్ని వెల్లడించారు. మునుగోడు ఉప పోరులో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవటానికి తనకున్న ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. ఎంపీల్లో ముప్పాతిక శాతాన్ని మునుగోడుకు దింపేసిన కేసీఆర్.. చివరకు తాను కూడా మునుగోడు నియోజకవర్గంలోని ఒక గ్రామానికి ఇంఛార్జిగా ఉండేందుకు సిద్ధం కావటం దేనికి నిదర్శనం? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కేసీఆర్.. ఒక ఉప ఎన్నిక కోసం ఇంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందా? అన్నది ఇప్పుడు చర్చగా మారింది. రాష్ట్రంలో దారుణ పరిణామం చోటు చేసుకున్నా.. అనుకోని ఉత్పాతం ఎదురైనా.. నేతలు సహజంగా చేపట్టే పరామర్శల్ని చేసేందుకు సుతారం ఇష్టపడని కేసీఆర్ లాంటి అధినేత..

ఒక ఉప పోరు కోసం ఒక గ్రామానికి ఎన్నికల ఇంఛార్జిగా ఉండటం దేనికి నిరద్శనం? అన్నది ప్రశ్నగా మారింది. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు.. వారి గోడు వినేందుకు బయటకు అడుగుపెట్టేందుకు ఇష్టపడని కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి..

మునుగోడు ఉప ఎన్నికకు మాత్రం ఇంచార్జీగా ఉండేందుకు సైతం వెనుకాడకపోవటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. అంతేకాదు.. ఎక్కడ ఉప పోరు జరిగితే.. ఆ నియోజకవర్గంలోని ఒక గ్రామాన్ని కానీ.. రెండు మూడు ప్రాంతాల్ని కానీ దత్తత తీసుకుంటామని చెప్పటాన్ని తప్పు పడుతున్నారు.

ఇప్పటికే దత్తత తీసుకున్న గ్రామాల మాటేమిటి? అక్కడ చేపట్టిన డెవలప్ మెంట్ ఏమిటో అందరికీ తెలిసేలా చెుప్పాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నారు. ఏమైనా ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ.. ఉప పోరులో ఒక గ్రామానికి ఇంఛార్జిగా ఉండటం కేసీఆర్ బలాన్ని చూపించే కంటే బలహీనతను బయటపెట్టుకున్నట్లుగా మారిందన్న మాట బలంగా వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News