వంశీ రాజకీయానికి ఓట్లు రాలుతాయా ?

Update: 2021-03-04 10:39 GMT
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో వైసీపీ అభ్యర్ధులను గెలిపించే బాధ్యత వల్లభనేని వంశీ మీద కూడా పడింది. వంశీకి విజయవాడ పాలిటిక్స్ తో ఏమీ సంబంధం లేదనే చెప్పాలి. ఎందుకంటే వంశీ గన్నవరం తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏ. కాకపోతే మారిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో వైసీపీకి మద్దతుగా నిలబడ్డారు. వైసీపీకి మద్దతుగా నిలబడగానే నియోజకవర్గంలో ప్రతి చిన్న విషయము రాజకీయంగా వివాదాస్పదమవుతునే ఉంది.

ఇలాంటి వంశీని జగన్మోహన్ రెడ్డి ఇపుడు విజయవాడలో కూడా దింపారని టాక్. కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీని గెలిపించి మేయర్ పోస్టు అందుకోవాలని అధికారపార్టీ పెద్ద ప్లాన్ వేసింది. దీనికి జిల్లాలోని ఇద్దరు మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని ఇప్పటికే రంగంలోకి దిగేశారు. వెల్లంపల్లి అయితే విజయవాడ దక్షిణం నుండే ఎంఎల్ఏగా గెలిచారు. ఇక సెంట్రల్ ఎంఎల్ఏ మల్లాది విష్ణు ఎలాగు ఉన్నారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వెల్లంపల్లి, మల్లాది ఇద్దరు కూడా విజయవాడ మొత్తం మీద ప్రభావం చూపేంత సీన్ లేదని సమాచారం. అందుకనే కీలకమైన నేతలందరినీ జగన్ రంగంలోకి దింపారట. ఇందులో భాగంగానే వంశీ కూడా దిగారు. పేరుకు గన్నవరం ఎంఎల్ఏనే అయినా వంశీ విజయవాడలో కూడా ఉంటారు. అందుకనే అదేపనిగా బాధ్యతలు అప్పగించారట.

అయితే జగన్ ఒకటనుకుంటే మరొకటి జరుగుతుందేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే వంశీ అంటే టీడీపీలో చాలామంది మండిపోతుంటారు. అలాంటి వంశీ ప్రత్యక్షంగా విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లోకి దిగితే ఎంఎల్ఏపై కోపంతో టీడీపీ నేతలంతా ఏకమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎలాగూ విజయవాడ టీడీపీ ఎంపి కేశినేని నాని ఇప్పటికే ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈయనకు తోడు మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ, ప్రస్తుత ఎంఎల్ఏ గద్దె రమ్మోహన్ తదితరులందరూ టీడీపీ తరపున గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే వంశీ ప్రచారానికి ఓట్లు రాలుతాయా అనేది ఆసక్తిగా మారింది.


Tags:    

Similar News