ఆ నియోజకవర్గంలో వైసీపీ ప్రయోగం ఈసారైనా ఫలిస్తుందా?

Update: 2023-01-04 06:50 GMT
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీకి పెద్ద సమస్యగా మారింది. వైసీపీ ఏర్పడ్డాక జరిగిన రెండు ఎన్నికలు 2014, 2019ల్లో ఆ పార్టీ ఓడిపోయింది. గత ఎన్నికల్లో వైసీపీ గాలి వీచినా పర్చూరులో విజయం సాధించలేకపోయింది.

పర్చూరులో వైసీపీకి సరైన అభ్యర్థి లేకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. 2014లో గొట్టిపాటి భరత్‌ వైసీపీ తరఫున పర్చూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికల ముందు వరకు రావి రామనాథం బాబు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నారు. అయితే ఎన్టీఆర్‌ పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పార్టీలో చేరడంతో ఆయనకు సీటు ఇచ్చారు. అయితే దగ్గుబాటి అతి తక్కువ మెజారిటీతో ఓడిపోయారు.

ఆ తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు సైతం వైసీపీలో క్రియాశీలకంగా లేరు. వాస్తవానికి దగ్గుబాటి కుమారుడు చెంచురామ్‌ ను పర్చూరు నుంచి పోటీ చేయించాలనుకున్నారు. అయితే ఆయనకు పౌరసత్వ సమస్యలు అడ్డుగా రావడంతో చివరి క్షణంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేశారు. ఓడిపోయాక మళ్లీ ఆయన ఎక్కడా వైసీపీ కార్యక్రమాల్లో కనిపించలేదు.

మరోవైపు 2019 ఎన్నికల ముందు వరకు ఉన్న రామనాథం బాబు టీడీపీలో చేరిపోయారు. మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కుమారుడు మధుసూదన్‌ రెడ్డిని పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమిస్తారని వార్తలు వచ్చినా అవి కార్యరూపం దాల్చలేదు.

ఎట్టకేలకు పర్చూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ ను నియమించారు. ఈ నియోజకవర్గంపై పార్టీ ఇప్పటికే అనేక ప్రయోగాలు చేసిన నేపథ్యంలో ఈసారైనా ఈ ప్రయోగం ఫలిస్తుందా అనే చర్చ జరుగుతుంది.

వాస్తవానికి ఆమంచి కృష్ణమోహన్‌ చీరాల నుంచి 2009, 2014ల్లో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో చీరాల నుంచి ఓడిపోయారు. చీరాల నుంచి టీడీపీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో గెలుపొందిన కరణం బలరామ్‌ ఆ తర్వాత వైసీపీతో సన్నిహితంగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ కరణం బలరామ్‌ లేదా ఆయన కుమారుడు వెంకటేష్‌ కు సీటు ఖాయమైనట్టే.

ఈ నేపథ్యంలో కీలకమైన కాపు సామాజికవర్గానికి చెందిన ఆమంచిని దూరం చేసుకోకుండా ఆయనను పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించారు. వాస్తవానికి ఆమంచికి కూడా పర్చూరు వెళ్లడం ఇష్టం లేదని వార్తలు వచ్చాయి. జనసేనలో చేరతారని వార్తలు హల్చల్‌ చేశాయి. కానీ చివరకు పర్చూరుకు వెళ్లడానికే ఆమంచి మొగ్గుచూపారు. దీంతో వైసీపీ అధిష్టానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.    



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News