70ఏళ్ల చంద్రబాబు.. చరిత్ర ఏంటి?

Update: 2020-04-20 06:30 GMT
40ఇయర్స్ ఇండస్ట్రీగా రాజకీయాల్లో పేరు గడించిన చంద్రబాబు పుట్టినరోజు నేడు. ఆయన పుట్టి 70 ఏళ్లు క్రాస్ అయ్యింది. చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లె అనే చిన్న గ్రామంలో 1950, ఏప్రిల్ 20 వ తేదీన చంద్రబాబు ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించాడు.  అతని తండ్రి ఎన్.ఖర్జూరనాయుడు వ్యవసాయదారుడు, తల్లి గృహిణి. అంచెలంచెలుగా చదువుకొని రాజకీయాల్లోకి వచ్చి యువ ఎమ్మెల్యే, మంత్రిగా.. అనంతరం ఎన్టీఆర్ అల్లుడిగా.. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా.. ప్రతిపక్ష నాయకుడిగా ఎక్కువ కాలం ఉన్న రాజకీయ నేతగా తెలుగు వారి చరిత్రలో నిలిచిపోయారు.

* ప్రాథమిక విద్యాభ్యాసం
తన స్వంత గ్రామం నారావారి పల్లెలో పాఠశాల లేనందున ప్రాథమిక విద్యాభ్యాసం కోసం రోజూ పొరుగు గ్రామమైన శేషాపురంకు నడుచుకుంటూ వెళ్ళేవాడు. ప్రాథమిక విద్య అనంతరం చంద్రగిరి లోని జిల్లాపరిషత్తు పాఠశాలలో చేరి 9వ తరగతిని పూర్తిచేశాడు. ఉన్నత చదువుల నిమిత్తం తిరుపతికి వెళ్ళి అక్కడ 10వ తరగతి పూర్తిచేసి,   1972లో బి.ఎ. చేసాడు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు.

*రాజకీయ జీవితం
చిన్నప్పటి నుండి ప్రజాసేవ పట్ల చంద్రబాబు ఆసక్తి కలిగి ఉండేవాడు. తొలుత ప్రభుత్వ ఉద్యోగం చేయాలని భావించాడు. అనంతరం ప్రజాసేవ చేయడానికి రాజకీయాలే సరైనవని నిర్థారించి రాజకీయాలపై దృష్టిపెట్టాడు. విద్యాభ్యాసం పూర్తి కాకముందే తిరుపతికి సమీపంలో ఉన్న చంద్రగిరిలో విద్యార్థి నాయకునిగా యువజన కాంగ్రెస్ లో చేరాడు. చదువుతున్నప్పుడే సెలవులు వచ్చినప్పుడు స్నేహితులను మరికొందరిని కూడగట్టుకుని గ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాలతో పలువురి ప్రశంసలందుకున్నారు. 1975లో భారతదేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో అతను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ గాంధీకి సన్నిహిత మద్దరుదారునిగా ఉన్నాడు.  శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ప్రతిభ రాజకీయ వ్యుహచతురత బయటపడింది.

కాంగ్రెస్ పార్టీలో చురుకైన నేతగా ఎదిగిన చంద్రబాబు నాయుడు 1978లో చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు. ఆంధ్రప్రదేశ్ శాసన సభకు ఎమ్మెల్యేగా తొలిసారి ప్రవేశించాడు. కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గంలో 20% కోటా సీట్లను యువజన విభాగానికి ఇచ్చినందున చంద్రబాబుకు ప్రయోజనం చేకూరింది. కొంతకాలం రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‍గా పనిచేశాడు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య మంత్రి వర్గంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ మంత్రిగా తన 28వ యేట నియమితులయ్యాడు.  క్యాబినెట్ లో తక్కువ వయసు గల మంత్రిగా గుర్తింపు పొందాడు. 1980 నుండి 1983 వరకు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశు సంవర్థక శాఖ, పాడి పరిశ్రమ, చిన్నతరహా నీటిపారుదల శాఖా మంత్రిగా పనిచేశాడు.

*భువనేశ్వరితో చంద్రబాబు వివాహం..
సినీమాటోగ్రఫీ మంత్రిగా అతను ప్రముఖ తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు దృష్టిలో పడ్డాడు. 1981, సెప్టెంబర్ 10 న ఎన్.టి.రామారావు మూడవ కుమార్తె భువనేశ్వరిని వివాహమాడాడు.  ఎన్టీఆర్ కు అల్లుడిగా మారాడు.

* తెలుగుదేశంలో చేరిక
1983 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అత్యధిక సీట్లు కైవసం చేసుకుంది. పార్టీ పెట్టిన 9 నెలలలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి తెలుగుదేశం పార్టీ అందరినీ ఆశ్చర్యపరచింది. చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేడసాని వెంకట్రామనాయుడు చేతిలో ఓటమి పాలయ్యాడు. తరువాత  చంద్రబాబు మామ ఎన్టీఆర్ ను కలిసి తెలుగు దేశం పార్టీలో చేరాడు. తరువాతి కాలంలో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయంగా ఉన్నతస్థాయికి ఎదిగి పలు సంచలనాలకు కేంద్రబిందువయ్యాడు. నాదెండ్ల భాస్కర్ రావును గద్దెదించడంలో చంద్రబాబు కీరోల్ పోషించి మామ ఎన్టీఆర్ దృష్టిలో పడ్డారు. 1985 వరకు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా పార్టీ యంత్రాంగాన్ని పటిష్ఠం చేశాడు.

*ఎన్టీఆర్ ను దించిన చంద్రబాబు
1994 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ విజయం సాధించి ఎన్టీరామారావు ముఖ్యమంత్రి అయ్యాడు. తెలుగుదేశం పార్టీలో ఎన్‌.టి.ఆర్ భార్య లక్ష్మీ పార్వతి జోక్యం పెరగడంతో పార్టీ వ్యవస్థాపకుడైన మామపై తిరుగుబాటు చేసాడు. తెలుగు దేశం శాసన సభ్యుల మద్దతును కూడగట్టుకొని ఎన్టీఆర్ ను అధికారం నుంచి దించి అతను 1995 సెప్టెంబరు 1న ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు.

*ఎమ్మెల్యేగా సీఎంగా సుధీర్ఘకాలం..
1978లో చంద్రబాబు తొలిసారి కాంగ్రెస్ నుంచి చంద్రగిరి నుంచి పోటీచేసి గెలిచారు. 1983లో టీడీపీ అభ్యర్థి చేతిలో బాబు ఓడిపోయాడు. 1989లో మరోసారి కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఎన్టీఆర్ ఓడిపోయి మనస్థాపంతో పక్కకు తప్పుకోవడంతో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించాడు. 1994లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ ను కూలదోసి సీఎం అయ్యారు. 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు సీఎంగా కొనసాగారు.

 ఆ తరువాత 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చాడు. 2004-2014 వరకు రెండు దఫాలు టీడీపీ ఓడిపోవడంతో అత్యధికకాలం ప్రతిపక్ష నేతగా ఉమ్మడి ఏపీలో కొనసాగారు. ఇక 2014లో ఉమ్మడి ఏపీ విడిపోయి తెలంగాణ, నవ్యాంధ్ర ఏర్పడింది. నవ్యాంధ్ర తొలి సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాడు. ఐదేళ్లు పాలించాడు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో మరోసారి ఇప్పుడు ప్రతిపక్షంలోకి మారిపోయారు.

1950 ఏప్రిల్ 20న  పుట్టిన చంద్రబాబుకు నేటితో 70 ఏళ్లు నిండాయి. ఆయన పుట్టిన రోజును తెలుగుదేశం శ్రేణులు పండుగలా చేసుకుంటున్నారు. బాబు బర్త్ డే సందర్భంగా మనమూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుదాం.. ఆయన చరిత్రను ఒక్కసారి తరిచి తెలుసుకుందాం..
Tags:    

Similar News