14 నిత్యవసర వస్తువులపై జీఎస్టీ ఉండదు.. సంతోషించొద్దు.. మోడీ మార్కు ట్విస్టు ఉంది

Update: 2022-07-20 04:27 GMT
వీధుల్లో నడుస్తున్న వేళలో పెద్ద పెద్ద షోరూంలో కనిపిస్తాయి. వాటి బయట ఏర్పాటు చేసిన బోర్డుల్లో భారీ ఆఫర్లు కనిపిస్తుంటాయి. 60 శాతం.. 75శాతం.. 80 శాతం.. అంటూ ఉండే అంకెలు ఊరిస్తాయి. అయితే.. ఈ ఊరింపు మత్తులో పడి షాపులోకి వెళ్లి.. అసలు విషయం తెలిసినంతనే కరెంటు షాక్ కొట్టినట్లుగా ఫీల్ అవుతాం.

అలాంటి తీరును ప్రదర్శించింది మోడీ సర్కారు. షోరూం తెలివిని దేశ ప్రజల మీద ట్వీట్ రూపంలో ప్రదర్శించారు కేంద్ర ఆర్థిక మంత్రి. తాజాగా అమల్లోకి వచ్చిన కొత్త జీఎస్టీ నిబంధనల్లో.. పలు నిత్యవసర వస్తువులపై జీఎస్టీ విధించిన వైనం.. మరి ముఖ్యంగా పెరుగు.. లస్సీలపై కూడా జీఎస్టీ  వాయింపు వాయించేయటం తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నాయి.

సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న నిరసనకు విపక్షాలు తోడు కావటంతో మోడీ సర్కారుకు కాస్త ఇబ్బందికరంగా మారినట్లుంది. దీనికి తోడు.. పెరుగు.. లస్సీలకు కూడా పన్ను వేయటం ఏమిటి? అన్న ప్రశ్న ప్రభుత్వానికి బాగానే తగిలినట్లుగా కనిపిస్తోంది. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ట్వీట్ చేశారు. అందులో పలు వస్తువులపై జీఎస్టీ ఎత్తి వేసినట్లుగా చెప్పి సంతోషానికి గురి చేశారు. అయితే.. మోడీ సర్కారు ఇలాంటి సంతోషాన్ని దేశ ప్రజలకు ఇస్తుందా? ఇందులో ఏదో మతలబు ఉందన్న మాట పలువురి నోట వినిపించింది.

నిజమే.. వారు అనుమానించినట్లుగానే విషయంలో మతలబు ఉంది. హ్యాపీ న్యూస్ అని చెప్పటమే కాదు.. అసలు వాస్తవం ఏమంటే.. పన్నులు ఎత్తేసినట్లుగా చెబుతూనే.. చిన్న మెలికి పెట్టి.. మొత్తంగా మళ్లీ లాగేసే టాలెంట్ ను నిర్మలమ్మ ప్రదర్శించారని చెప్పాలి. నిర్మలమ్మ ట్వీట్ ప్రకారం చూస్తే.. ‘పప్పులు.. గోధుమలు.. ఓట్స్.. రాగులు.. బియ్యం.. ఆటా.. బాంబే రవ్వ.. శనగపిండి.. పెరుగు.. లస్సీ లాంటి పదార్థాల మీద విధించిన జీఎస్టీని ఎత్తేసినట్లుగా పేర్కొన్నారు. అయితే.. ఇందులో అసలు మతలబు ఏమంటే.. ఈ వస్తువులన్ని ప్యాకింగ్ లో కాకుండా.. లూజ్ గా ఉంటేనే జీఎస్టీ పోటు నుంచి తప్పించుకోవచ్చు.

ఒకవేళ.. ప్యాకింగ్ ఉన్నప్పటికీ.. బ్రాండింగ్ ఉండకూడదన్న రూల్ ఒకటి పెట్టారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్యాకింగ్ ఎంత ముఖ్యమో.. దానికో బ్రాండ్ చాలా అవసరం. అది లేకుండా కొనేటోళ్లు చాలానే తగ్గిపోయారు. ప్యాకింగ్ మీద ఎలాంటి వివరాలు లేకుండా ఉంటే.. దాన్ని తక్కువ ధరకు ఇస్తున్నా.. తొందరపడి కొనేటోళ్లు బాగా తగ్గిపోయారు.

ఏమైనా ఇటీవల కాలంలో వచ్చిన మార్పుల్లో ముఖ్యమైనది ఒకటి ప్యాకింగ్.. మరొకటి బ్రాండింగ్. ఈ రెండు చాలా ముఖ్యం. అలాంటిది ఈ రెండూ లేని వాటికే వీటిపై విధించే జీఎస్టీ మినహాయింపు ఉంటుందంటే ఎవరు మాత్రం వాటిని కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. ఒకవేళ కొన్నా.. చాలా చాలా తక్కువ మంది మాత్రమే కొంటారు. లేబుల్ లేకుండా ఉన్న వస్తువులకు జీఎస్టీ లేకపోవటం.. ఒకవేళ ప్యాకింగ్ ఉండి కొంటే దానికి 5 శాతం జీఎస్టీని విధిస్తారు.
Tags:    

Similar News