అసద్ సమక్షంలో 'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలు

Update: 2020-02-21 05:30 GMT
సంచలన ఘటన ఒకటి కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సభల్లో భాగంగా తాజాగా బెంగళూరులో నిర్వహించారు. ఈ సభకు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీతో పాటు పలువురు హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. వేదిక మీదకు వచ్చిన అమూల్య అనే యువతి.. మైకు అందుకొని పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయటం షురూ చేసింది. రెండుసార్లు ఆమె నోట్లో నుంచి వచ్చిన నినాదంతో అసద్ షాక్ తిన్నారు.

ఆ వెంటనే.. ఆమె వద్దకు వడివడిగా వచ్చి మైకు లాగేసుకునే ప్రయత్నం చేశారు. నిర్వాహకులు పలువురు అభ్యంతరం చెబుతుంటే.. హిందుస్థాన్ జిందాబాద్ అంటూ పేలవమైన నినాదం చేసింది. ఈ ఉదంతం సంచలనంగా మారింది. అసద్ సమక్షంలో పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన మహిళ తీరుకు విస్మయానికి గురైన అసద్.. ఆ తర్వాత జరిగిన దానికి క్షమాపణలు చెప్పారు.

ఫైర్ బ్రాండ్ మాదిరి వ్యవహరిస్తూ మాటలతో విరుచుకుపడే అసద్.. ఒక అమ్మాయి వేలాది మందిని ఉద్దేశించి.. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తుంటే.. విస్మయానికి గురయ్యారే తప్పించి.. ఆగ్రహాన్ని ప్రదర్శించేందుకు తటపటాయించటం గమనార్హం. నినాదాలు చేసిన యువతితో తమకు ఎలాంటి సంబంధం లేదని సభ నిర్వాహకులు వ్యాఖ్యానించారు. ఆ యువతి ఎవరో తమకు తెలీదని.. ఆమె ప్రవర్తన హిందూ.. ముస్లింల మధ్య చిచ్చు పెట్టే కుట్రలా సాగుతోందంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

తన నినాదాల్ని ఆపే ప్రయత్నం చేసినప్పుడు మైకు లేకుండానే మాట్లాడే ప్రయత్నం చేసిందా యువతి. పాకిస్థాన్ జిందాబాద్ కు.. హిందూస్థాన్ జిందాబాద్ కు మధ్య ఉన్న తేడా ఏమిటంటే అంటూ మాట్లాడుతున్న ఆమెను బలవంతంగా స్టేజ్ కిందకు తీసుకెళ్లారు. అమూల్య మాటల్ని అసద్ తీవ్రంగా ఖండించారు. ఆమెతో తమకు ఎలాంటి సంబంధం లేదన్న ఆయన.. తాము భారత్ జిందాబాద్ అనేవాళ్లమని.. భారత్ జిందాబాద్ అనే అంటామన్నారు. ఇక.. దాయాదికి జిందాబాద్ కొట్టిన అమూల్యపై దేశద్రోహం కేసును నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.


Tags:    

Similar News