శబరిమల ఆలయంలోకి మహిళలు వెళ్తున్నారా?

Update: 2016-06-18 09:57 GMT
దేశంలో పలు ఆలయాల్లో మహిళలకు ప్రవేశం లేని సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో కొన్నిచోట్ల ఈ విషయంలో పెద్ద రగడే జరిగింది. మహారాష్ట్రలోని శనిసింగనాపూర్ ఆలయంలోకి ప్రవేశించడానికి మహిళా సంఘాలు ఏకంగా పోరాటమే చేసి కొంతవరకు అనుకున్నది సాధించాయి. శనిసింగనాపూర్ మాదిరిగానే శబరిమలై అయ్యప్ప ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేని సంగతి తెలిసిందే. అయితే.. శబరిమల విషయంలో ఎవరూ పోరాటాలు చేయకపోయినా ఓ యువతి మాత్రం కొత్త ఎత్తుగడతో ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. మగరాయుడిలా వేషం మార్చుకుని టెంపుల్ లోకి ఎంటరయ్యేందుకు ట్రై చేసింది. అయితే భద్రతాధికారులు ఆమెకు గుర్తించి వెనక్కి పంపించి వేశారు.

తమిళనాడు రాష్ట్రంలోని మధురైకి చెందిన లక్ష్మీ అనే పద్దెనిమిదేళ్ల యువతి పోలీసులు కళ్లు గప్పి ఎలాగైనా స్వామి వారి దర్శనం చేసుకోవాలన్న పట్టుదలతో గురువారం రాత్రి 7 గంటలకు ప్యాంటు - షర్టు వేసుకొని బయర్దేరింది. పంబానది ప్రాంతంలో ఆమె నడిచి వెళ్తుండగా ఆలయ భద్రతాధికారులు అనుమానం రావడంతో ఆమెను అడ్డుకున్నారు. అనంతరం అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. శబరిమలై ఆలయంలోకి ప్రవేశించేందుకు గుండు గీయించుకొని మగవేషంలో వచ్చినట్లు ఆమె పోలీసుల విచారణలో వెల్లడించింది. దీంతో ఆమెను తిరిగి వెనక్కి పంపించేశారు. ఇది కేరళలోనే కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనంగా మారింది.

శబరిమల ఆలయ సంప్రదాయాన్ని మార్చాలని కోరుతూ కేరళ న్యాయవాదుల సంఘం హైకోర్టులో వేసిన కేసు పెండింగ్‌ లో ఉంది. మహిళలకు ఆలయంలోకి ప్రవేశం కల్పించాలని కోర్టు తీర్పు కూడా ఇచ్చింది. అయినా.. దీనిపై ఏకాభిప్రాయం సాధించేందుకు కృషి చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఇంకా మహిళలకు ప్రవేశం కల్పించడం లేదు. శబరిమలలోని అయ్యప్ప దేవాలయంలోకి అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశం కల్పించడంపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని ప్రభుత్వం తలపోస్తోంది. కాగా ఇంతకుముందు కూడా ఇలా ఒకరిద్దరు మహిళలు ఆలయంలోకి పురుష వేషంలో ప్రవేశించాలని ప్రయత్నించి విఫలమయ్యారట. భద్రతాధికారులు ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నా ఇప్పటికే ఇలా కొందరు ప్రవేశించి ఉంటారన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News