మహిళలకు గులాబీ ముళ్లు

Update: 2018-09-07 07:28 GMT
తెలంగాణ రాష్ట్ర సమితి. రాజకీయ పార్టీలకు వ్యూహ ప్రతివ్యూహాలను రుచి చూపించడంలో దిట్ట. ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాజకీయాల ముందు ఎవ్వరైనా దిగదుడుపే. అయితే ఎందుకో గాని ఆయనకు మహిళల పట్ల ముందు నుంచి చిన్న చూపే అని పార్టీలో అంతర్గతంగా వినిపిస్తోంది. తెలంగాణ తొలి ప్రభుత్వంలో ఒక్కరంటే ఒక్కరు కూడా మహిళా మంత్రి లేరు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి మాత్రమే ఉప సభాపతి పదవి ఇచ్చారు. ఆమె మంత్రి పదవి కోసం ఎంతో ప్రయత్నించినా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కనికరించలేదు. అయిష్టంగానే ఉప సభాపతి పదవి ఇచ్చారని పార్టీలో అంతర్గతంగా అంటారు. మంత్రివర్గంలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వలేదని - వారంటే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కూడా పడదని ప్రతిపక్షాలు అనేక సార్లు విమర్శించాయి.

అయితే వాటిని పట్టించుకోని ముఖ్యమంత్రి తెలంగాణ మహిళలకు ఏం చేయాలో నాకు తెలుసు అని శాసనసభలోనే ప్రకటించారు. ఇదంతా గతం. ఇక ప్రస్తుతానికి వస్తే ముందస్తుకు ముహూర్తం ఖరారై పోయింది. తెలంగాణ రాష్ట్ర సమితి తన తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఏకంగా 105 మంది అభ్యర్థులున్నారు. ఇక ప్రకటించాల్సిన స్ధానాలు 14. తొలి జాబితాలో కేవలం నలుగురంటే నలుగురే మహిళలకు టికెట్లు కేటాయించారు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు. 105 మంది ఉన్న తొలి జాబితాలోనే నలుగురు మహిళలుంటే మిగిలిన 14 మంది జాబితాలో ఇంకెంత మంది మహిళలు ఉంటారని పార్టీలో ప్రశ్నలు వస్తున్నాయి.

సిట్టింగ్ స్థానాల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన కొండా సురేఖ - చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బోడిగె శోభల పేర్లు ప్రకటించలేదు. అయితే, వీరికి టికెట్లు ఇస్తారో లేక పక్కన పెడతారో ఇంకా తేలాల్సి ఉంది. మహిళలకు ఇన్ని తక్కువ స్థానాలు కేటాయించడం పట్ల పార్టీలో టికెట్లు ఆశిస్తున్న మహిళలు అలకబూనారు. వారందరిని సముదాయించే బాధ్యతను కుమార్తె - లోక్‌ సభ సభ్యురాలు కవితకు అప్పగించారని సమాచారం. బుజ్జగింపులు ఎలా ఉన్నా తెలంగాణ రాష్ట్ర సమితి మహిళలను పట్టించుకోదు అనే అపవాదు మాత్రం ప్రజల్లోకి.. ముఖ్యంగా మహిళాలోకానికి తెలిసిపోయింది. గులాబీ పార్టీలో పువ్వులు మగవారికి - ముళ్లు మహిళలకు ఇస్తారా అని మహిళా నేతలు ఆగ్రహిస్తున్నారు.


Tags:    

Similar News