రెజ్లర్ సుశీల్‌కుమార్ ఆయుధ లైసెన్స్ క్యాన్సల్ !

Update: 2021-06-01 10:30 GMT
ఛత్రసాల్ స్టేడియం వద్ద యువ రెజ్లర్ సాగర్ ధన కర్ హత్య కేసులో అరెస్ట్ అయిన స్టార్ రెజ్లర్, ఒలంపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్ ఆయుధ లైసెన్స్ ను రద్దు చేసినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. లైసెన్స్ రద్దు ప్రక్రియను లైసెన్స్ డిపార్ట్‌ మెంట్ ప్రారంభించినట్టు చెప్పారు. ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్‌ లో భాగంగా గత ఆదివారం సుశీల్ కుమార్‌ ను తీసుకుని హరిద్వార్ వెళ్లారు.

సుశీల్ కుమార్ పరారీలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ తలదాచుకున్నారు, ఆయనకు ఎవరెవరు సహకరించారనే దానిపై దర్యాప్తు సాగించారు. ఇంతవరకూ సాగర్ ధన్‌ కర్ హత్య కేసులో 13 మంది వ్యక్తుల ప్రమేయమున్నట్టు ఢిల్లీ పోలీసుల విచారణలో తేలింది. వీరిలో 9 మందిని అరెస్టు చేయగా, నలుగురు పరారీలో ఉన్నారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న 38 ఏళ్ల సుశీల్ కుమార్, అతని అసోసియేట్ అజయ్ బకర్‌ వాలాను ఢిల్లీ స్పెషల్ సెల్ టీమ్ మే 23న ఢిల్లీలోని ముండ్కా ఏరియాలో అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం, అరెస్టును తప్పించుకునేందుకు సుశీల్ కుమార్ 18 రోజుల్లో ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సరిహద్దులను దాటాడు. తరుచు సిమ్ కార్డులను మారుస్తూ వచ్చాడు. నేరం చేసిన సమయంలో అతను వేసుకున్న దుస్తులు, వాడిన సెల్‌ఫోన్‌ను పోలీసులకు ఇంకా స్వాధీనపరచలేదు. విచారణలో రెజ్లర్‌ సహకరించకపోవడంతో పోలీసులు మేజిస్ట్రేట్‌ ముందు వాదనల్ని వినిపించి అతని కస్టడీని ఇంకొన్ని రోజులు పొడిగించుకున్నారు. సుశీల్‌ దాడిలో సాగర్‌ చికిత్స పొందుతూ మరణించగా ఈ విషయం తెలుసుకున్న రెజ్లర్‌ ముందుగా హరిద్వార్‌కే పరారైనట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. దీంతో అతన్ని అక్కడికి తీసుకెళ్లి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News