జ్యోతిషం :చంద్రబాబుకు పవన్ గండమేనా?

Update: 2018-02-20 11:16 GMT
మనలో జ్యోతిష శాస్త్రాన్ని నమ్మే వారు కొందరు ఉండొచ్చు. అలాంటి వారికి మాత్రం ఇది ఆసక్తికరమైన వార్త. ‘పవన్ కల్యాణ్ మనోడే’ అంటూ ఆయన ఎలాంటి ఉద్యమాలు చేస్తున్నప్పటికీ.. చంద్రబాబునాయుడు తన పార్టీ శ్రేణులకు భరోసా ఇస్తూ - పవన్ అడిగిన ప్రతి వివరమూ పంపి సహకరిస్తూ .. ఆవిధంగా ముందుకు పోతున్నారు గానీ.. గ్రహగమనాల గణనల ప్రకారం.. రాబోయే రోజుల్లో  పవన్ వలన చంద్రబాబుకు అధికార గండం తప్పకపోవచ్చుననే శాస్త్రం చెబుతున్నదిట. ఇదేదో ఆషామాషీ జోస్యం కాదు. విశాఖలో ఓ పేరుమోసిన పీఠాధిపతి వారు ఇలా సెలవిచ్చారు.

‘‘రాబోయే రోజుల్లో.. సినీనటులు పెట్టిన  - పెట్టబోతున్న పార్టీల వల్ల అధికార పార్టీలకే గండం పొంచి ఉన్నద’ని.. విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన మహా కామేశ్వర పీఠం అధిపతి - యద్ధనపూడి అయ్యన్న పంతులు వ్యాఖ్యానించారు. పవన్ రాజకీయాల్లో వస్తున్న సంగతిని కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. సినిమావాళ్లు రాజకీయాల్లోకి వస్తే.. అధికారంలో ఉన్న పార్టీ కాకుండా.. మరో పార్టీ విజయం సాధిస్తుందనేది యద్ధనపూడి పంతులుగారి ఉవాచ.

దక్షిణాది మొత్తం దాదాపుగా రాజకీయాలు ప్రస్తుతం సినిమావాళ్ల మయం కాబోతున్నాయి. ఏపీలో పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీచేయబోతున్నాం.. అని ప్రకటించేశారు. తమిళనాడులో సూపర్ స్టార్ లు రజనీకాంత్ - కమల్ హాసన్ లు తమ తమ రాజకీయ ప్రస్థానం గురించి ప్రకటనలు చేసేసి.. రాష్ట్రవ్యాప్త పర్యటనలతో ఎన్నికలకు సిద్ధమయ్యే పనిలో ఉన్నారు. ఇదే సమయంలో త్వరలోనే అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న కర్నాటకలో సినీ హీరో ఉపేంద్ర చాలా ముమ్మరంగా ఎన్నికల ప్రచారం సాగించేస్తున్నారు. మరి యద్ధనపూడి పంతులు గారు గ్రహాల గమనాన్ని గణించి.. ప్రకటించిన.. ఈ జ్యోతిష ఫలితం  ఎంత మేరకు నిజం అవుతుందో.. కన్నడ ఎన్నికల ఫలితాలతో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన పరిధిలో సినిమా వాళ్లు ప్రభావితం చేసే రేంజిలో దగ్గర్లో జరగబోతున్న ఎన్నికలు అవే. ఉపేంద్ర ఎంట్రీ పుణ్యమాని.. అక్కడ కాంగ్రెస్ పరాజయం పాలైతే.. గనుక.. పవన్ గండం ఎఫెక్ట్ వచ్చే ఏడాది ఎన్నికల్లో చంద్రబాబు కూడా గద్దె దిగాల్సి రావచ్చునని పలువురు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News