బాబుకు తగాదా పెట్టిన ఈటెల

Update: 2016-03-14 13:13 GMT
తెలుగు రాష్ర్టాలుగా విడివ‌డిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ - తెలంగాణ‌ల మ‌ధ్య వివిధ అంశాల మ‌ధ్య  సారుప్య‌త ఉండ‌టం స‌హజం. ఈ క్ర‌మంలో ప‌రిపాల‌కులు ఒకింత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సింది పోయి త‌మ‌దైన శైలిలో కొత్త వివాదాలు సృష్టించ‌డం ఇపుడు స‌మ‌స్య‌ల‌కు కార‌ణంగా మారుతోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌  ఆర్థిక మంత్రి యనమల రామ‌కృష్ణుడు బడ్జెట్ ప్రసంగం పూర్తిగా ఇంగ్లిష్‌ లో చేయ‌డం....తెలంగాణ మంత్రి ఈటెల తెలుగులో బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇపుడు కొత్త చ‌ర్చ‌కు దారితీసింది. ఏకంగా చంద్ర‌బాబును వివాదంలోకి లాగే స్థాయికి ఈ సంవాదం చేరింది.

మాజీ ఎంపీ- సాహిత్య అవార్డు గ్ర‌హిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఏపీ ఆర్థిక మంత్రి తీరుపై, ఆయ‌న‌తో పాటు చంద్ర‌బాబు వైఖ‌రిపై మండిప‌డ్డారు. తెలంగాణ ఆర్థిక‌మంత్రి ఈటెల తెలుగులో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌డం త‌నకు చాలా సంతోషంగా ఉందని మీడియాతో మాట్లాడుతూ యార్లగ‌డ్డ‌ అన్నారు. ఏపీ ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల బ‌డ్జెట్ సంద‌ర్భంగా చేసిన ఆంగ్ల ప్ర‌సంగంతో తాను సిగ్గుపడుతున్నాన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.  తెలుగు పేరుతో ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ తెలుగు భాషను నిర్లక్ష్యం చేయడం తగదని యార్లగ‌డ్డ ఒకింత క‌ఠువుగా వ్యాఖ్యానించారు.

టెక్నాల‌జీ మంత్రం జ‌పించడం చంద్ర‌బాబును సామాన్యులకు దూరం చేసేందుకు దోహ‌ద‌ప‌డిన‌ట్లే...తాజాగా ఇంగ్లిష్ మంత్రం జ‌పిస్తున్న బాబు మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుల వ‌ల్ల‌ త్వ‌ర‌లో ఆంగ్ల పక్ష‌పాతిగా ముద్ర‌ప‌డిపోయి తెలుగు పేరు ఎత్త‌కుండా మారే అవ‌కాశం ఉన్న‌ట్లు క‌నిపిస్తున్న‌ది. బాబు ఈ విష‌యంలో జాగ్ర‌త్త వ‌హించాల్సిన అవ‌స‌రం ఉందేమో.
Tags:    

Similar News