నేనో పవనో తేలిపోవాలి...అంబటి అల్టిమేట్ సవాల్

Update: 2022-12-28 14:20 GMT
వైసీపీలో చేరిన తరువాత ఎట్టకేలకు రెండవసారి గెలిచి తన చిరకాల మంత్రి కోరికను తీర్చుకున్న జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుని ఒక విషయంలో మెచ్చుకోవాలి. ఆయన ఎపుడూ విధేయతను మార్చలేదు. వైఎస్సార్ ఫ్యామిలీని అట్టిపెట్టుకుని ఉన్నారు. దానికి తగిన ప్రతిఫలం కూడా లేట్ గా అయినా అందుకున్నారు.

ఇదిలా ఉండగా జగన్ సర్కార్ మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసే ఘాటైన విమర్శలకు అంబటి రాంబాబు తనదైన రివర్స్ కౌంటర్లు ఇస్తూ ప్రభుత్వం తరఫున ముందు వరసలో ఉంటూ కాచుకుంటారు. జగన్ మీద ఈగ వాలితే ఆయన సహించను అన్నట్లుగా ఉంటారు. ఈ విషయంలో ఆయన సొంత సామాజికవర్గానికి కూడా ఒక గట్టి సూచన చేశారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ణో తననో ఎంచుకోవాలని ఆయన కాపులకు సూచించారు.

జనసేన పేరిట పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఎంతసేపూ టీడీపీ అధినేత చంద్రబాబుకే మద్దతు ఇస్తూ ఆయనకు కాపుల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని అంబటి అంటున్నారు. పవన్ చంద్రబాబుని సీఎం గా చేయాలని చూస్తే తాను జగన్ తో ఉన్నానని, పైగా కాపులకు తానే ఎక్కువ మేలు చేస్తున్నాను అని అంబటి అంటున్నారు.

ఏ ఒక్క సీట్లో గెలవకుండా పోటీ చేసిన రెండు చోట్లా పవన్ ఓడారని, ముందు ఆయన గెలిచి వైసీపీ మీద విమర్శలు చేయాలని అంబటి అంటున్నారు. అపూర్వమైన ప్రజాదరణతో వైసీపీ అధికారంలోకి వచ్చిందని, ఈ ప్రభుత్వాన్ని విమర్శించడమే కాకుండా మళ్లీ అధికారంలోకి రానీయను అని పవన్ అనడం పట్ల అంబటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ కి రాజకీయల మీద కనీస అవగాహన లేదని అంబటి అంటున్నారు. కాపుల హక్కుల కోసం పోరాడుతానని చెబుతున్న పవన్ చివరికి చంద్రబాబుని సీఎం చేయడం కోసమే ప్రయత్నం చేస్తారని ఆయన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటారని అంబటి చెబుతున్నారు. బాబు పాటకు పవన్ డ్యాన్స్ చేయాల్సిన పరిస్థితి ఉందని అంబటి చెప్పుకొచ్చారు.

పవన్ చంద్రబాబుని సీఎం గా చేయడానికి ఇష్టపడుతూంటే తాను జగన్ని సీఎం గా చేయడానికి చూస్తే తప్పేంటి అని ఒక లాజిక్ పాయింట్ నే అంబటి తీశారు. కాపు సీఎం అన్నది లేని చోట ఎవరో సీఎం అవుతున్న వేళ తాను ఎటు వైపు ఉంటేనేంటి అన్నట్లుగా అంబటి కాపులకు ఒక కీలక మేసేజ్ ని పంపించారు. కాపులు సీఎం కాకుండా బాబుని పవన్ చేయాలనుకుంటునపుడు కాపులు ఆలోచించుకోవాలని ఆయన సూచిస్తున్నారు

అటు పవన్ ఇటు నేను ఉన్నాం, కాపులు ఎవరి వైపు ఉంటారో ఎంపిక చేసుకోవాలని ఆయన కోరడం విశేషం. మీరు ఆ గట్టున ఉంటారా ఈ గట్టుకు వస్తారా అన్నట్లుగా చాయిస్ కాపులకు అంబటి ఇస్తున్నారు. తాను వైఎస్సార్ కుటుంబంతో దశాబ్దాలుగా కట్టుబడి ఉన్నానని, నాడు వైఎస్సార్ తో నేడు జగన్ తో తన రాజకీయ ప్రయాణం సాగుతోంది అని ఆయన వివరించారు.

తాను రాజకీయంగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాను అని ఆయన స్పష్టం చేశారు. అందువల్ల కాపులే ఏదో ఒకటి తేల్చుకోవాలని ఆయన అడుతున్నారు. మొత్తానికి అంబటి కాపులకు మంచి పరీక్షే పెట్టారని అంటున్నారు. చూడాలి మరి దీని మీద జనసేనె నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News