వైసీపీలో వారికే ప్రయారిటీ...లెక్కలు మారుతాయా.. ?

Update: 2021-11-11 02:30 GMT
వైసీపీ రాజకీయం వేరు. టీడీపీ పాలిటిక్స్ వేరు. తెలుగుదేశం ఏళ్ల తరబడి చేసిన ట్రెడిషనల్ పాలిటిక్స్ కి చెక్ పెడుతోంది వైసీపీ. 2019లో ఆ పార్టీ చేసిన సోషల్ ఇంజనీరింగ్ ఫలితమే ఏకపక్షంగా ఉత్తరాంధ్రాలోని మూడు జిల్లాల్లో ఓట్లూ సీట్లు దక్కాయి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే టీడీపీ ఏలుబడిలో వెలమలదే పెత్తనం. వారికే పెద్ద పీట. దివంగత ఎర్రన్నాయుడుతో మొదలుపెడితే అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడు వంటి వారంతా బలమైన వెలమ సామాజిక వర్గానికి చెందిన వారే. దాంతో జిల్లాలో వారిదే హవా అన్నట్లుగా ఈ రోజుకీ సీన్ ఉంది. శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే కాళింగులు బలంగా ఉన్నారు. అలాగే తూర్పు కాపులు కూడా గట్టిగానే ఉన్నారు. బీసీలు కూడా అన్ని రకాలుగా నిలబడుతున్నారు.

జగన్ అధికారంలోకి వచ్చాక వెలమలకు ప్రాధాన్యత ఇస్తూనే మిగిలిన సామాజికవర్గాల వారికి కూడా అవకాశాలు పెంచుతున్నారు. అందులో భాగంగానే ఈ జిల్లాకు ఎక్కువ పదవులు కూడా దక్కాయి. వెలమ సామాజికవర్గానికి చెందిన ధర్మాన క్రిష్ణ దాస్ కి ఏకంగా డిప్యూటీ సీఎం ఇచ్చి గౌరవించిన జగన్ అదే సమయంలో కాళింగ సామాజికవర్గం నుంచి తమ్మినేని సీతారామ్ ని స్పీకర్ గా చేశారు. ఇక ఎన్నడూ లేని విధంగా బీసీ మత్య్సకార సమాజిక వర్గానికి చెందిన సీదరి అప్పలరాజుని ఫస్ట్ టైమ్ లోనే మంత్రిని చేశారు. కాళింగ సామాజికవర్గం నుంచి దువ్వాడ శ్రీనివాస్ కి ఎమ్మెల్సీ ఇచ్చారు.

బీసీ వర్గాలకు జిల్లా పరిషర్ చైర్మన్ సీటు అప్పగించారు. ఇపుడు మరో ఎమ్మెల్సీ ఇదే జిల్లాకు దక్కబోతోంది. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన పాలవలస విక్రాంత్ కి ఎమ్మెల్సీ గ్యారంటీ అంటున్నారు. జగన్ ఒడిషా టూర్ లో భాగంగా పాతపట్నం వచ్చినపుడు ఈ మేరకు విక్రాంత్ కి అభయం ఇచ్చారని అంటున్నారు. పాలవలస ఫ్యామిలీకి జిల్లాలో మంచి పట్టుంది. పాలవలస రాజశేఖరం గతంలో కాంగ్రెస్ తరఫున ఎంపీగా అయ్యారు. ఇపుడు ఆయన కుమార్తె రెడ్డి శాంతి పాతపట్నం ఎమ్మెల్యేగా ఉన్నారు. విక్రాంత్ కి ఎమ్మెల్సీ ఇస్తే కనుక మరింతగా వారికి ప్రయారిటీ ఇచ్చినట్లుగా ఉంటుంది.

మరో వైపు మంత్రి వర్గ విస్తరణలో కూడా ఈసారి ఇతర సామాజిక వర్గాలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఉంటుంది అంటున్నారు. మొత్తానికి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు జిల్లాగా ఉన్న సిక్కోలులో ఆ పార్టీని దెబ్బకొట్టడానికి వైసీపీ తనదైన మార్క్ సోషల్ ఇంజజీరింగ్ కి తెర తీసింది అంటున్నారు. అదే విధంగా విజయనగరంలో తూర్పు కాపులకు పెద్ద పీట వేస్తున్నారు. విశాఖలో కూడా కాపులే మళ్లీ మంత్రులు అంటున్నారు. మొత్తానికి చూస్తే టీడీపీ జనసేనల నుంచి ఎదురయ్యే సవాళ్ళను ధీటుగా ఎదుర్కొనేందుకే జగన్ ఈ రకంగా యాక్షన్ ప్లాన్ రెడీ చేసి పెట్టుకున్నారని అంటున్నారు.




Tags:    

Similar News