వైసీపీకి జాక్ పాట్ దక్కినట్లే

Update: 2021-11-10 07:38 GMT
ఏ పార్టీకైనా ఒక్కసారిగా 14 మంది ఎంఎల్సీలను ఎంపిక చేసుకునే అవకాశం రావడం నిజంగా జాక్ పాట్ కొట్టినట్లే అనుకోవాలి. ఇపుడా అవకాశం వైసీపీకి వచ్చింది. స్ధానిక సంస్ధల కోటాలో 11 మంది ఎంఎల్సీలను భర్తీ చేసే అవకాశం అధికార పార్టీకి దక్కింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమీషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పటికే ఎంఎల్ఏల కోటాలో మూడు ఎంఎల్సీ స్ధానాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిన విషయం తెలిసిందే. అంటే ఎంఎల్ఏల కోటాలో భర్తీ అయ్యే 3 స్ధానాలు, స్ధానిక సంస్ధల కోటాలో భర్తీ అవ్వబోయే 11 స్థానాలు కలిపి మొత్తం 14 ఎంఎల్సీ స్థానాలు వైసీపీ ఖాతాలో పడబోతున్నాయి.

నిజంగా 2021, నవంబర్ నెల వైసీపీకి లక్కీ నెలనే అనుకోవాలి. పార్టీ పెట్టిన ఇన్ని సంవత్సరాలకు ఇంతటి గొప్ప అవకాశం దక్కింది. ఎంఎల్ఏల కోటాలో భర్తీ చేయబోయే స్ధానాలకు అభ్యర్ధులను జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే డిసైడ్ చేశారనే ప్రచారం పార్టీలో బాగా జోరుగా జరుగుతోంది. ఇదే ఊపులో 11 మంది ఎంఎల్సీ అభ్యర్ధులను కూడా జగన్ కన్ఫర్మ్ చేయాల్సుంది. వీటిల్లో కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల నుండి రెండేసి సీట్లున్నాయి.

అలాగే అనంతపురం, తూర్పుగోదావరి, విజయనగరం, చిత్తూరు, ప్రకాశం జిల్లాల నుండి ఒక్కో స్థానాన్ని భర్తీ చేయాల్సుంది. ఒక్కసారిగా ఇన్ని స్ధానాలు దక్కటంతో ఆశావహుల నుండి జగన్మోహన్ రెడ్డిపై ఒత్తిడి పెరిగిపోయే అవకాశాలున్నాయి. నిజానికి ఏ పోస్టుకు ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో జగన్ కు స్పష్టమైన అవగాహనుంది. తన ప్లాన్ ప్రకారమే తాను నేతలను పిక్ చేసుకుంటారు. అంతేకానీ ఒత్తిళ్ళు పెట్టారనో లేకపోతే మొహమాటానికి పోయే అభ్యర్ధులను ఎంపిక చేసే అవకాశాలు లేవు.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారమైతే ఏ కోటాలో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో జగన్ ఇప్పటికే ఓ ఆలోచన చేశారట. అంటే ఏ జిల్లాలో పార్టీ కోసం పనిచేస్తున్నదెవరు ? పార్టీకి ఉపయోగపడేవారు ఎవరనే విషయంలో ఓ క్లారిటీ ఉన్నట్లే. ఇదే సమయంలో వివిధ సందర్భాల్లో తాను ఎవరికి ఏమి హామీ ఇచ్చారనే విషయాన్ని కూడా జగన్ గుర్తు పెట్టుకుని మరీ హామీలను నెరవేరుస్తున్నారు. చివరి నిముషంలో తలెత్తే పరిణామాల కారణంగా ఒక్కోసారి మాత్రం మిస్సయిపోతోంది. ఇలా హామీ ఇచ్చి నిలుపుకోలేక పోతున్న దానిలో గుంటూరు జిల్లా చిలకలూరిపేట నేత మర్రి రాజశేఖర్ ఉన్నారు.

ఒకవైపు షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. నిజానికి షెడ్యూల్ ఎన్నికలు జరగాల్సింది 2024లోనే. అయితే ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలను కూడా కొట్టిపారేసేందుకు లేదు. అందుకనే రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి ఉపయోగపడేవారికి జగన్ ప్రాధాన్యత ఇస్తారని అనుకుంటున్నదే. ఇందులో భాగంగానే సామాజికవర్గాల సమతూకాన్ని కూడా పాటిస్తారు. ఇప్పటివరకు పార్టీకి వచ్చిన అవకాశాలు, ప్రభుత్వ నియామకాల్లో బీసీలు, మైనారిటీలు, మహిళలు, కాపులకు మొదటి ప్రాధాన్యతిస్తున్నారు. బహుశా రేపటి ఎంఎల్సీ అభ్యర్ధుల ఎంపికలో కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతారు. మరి ఆ లక్కీ నేతలెవరో చూడాల్సిందే.




Tags:    

Similar News