వారి మాట అంతేనా : జంపింగులకే జగన్ భరోసా ?

Update: 2022-06-23 17:30 GMT
వైసీపీ అధినాయకత్వం ఆలోచనలు కొత్తగా ఉంటున్నాయని పార్టీలో పెద్ద చర్చ సాగుతోంది. పార్టీ గెలుపు కోసం అభివృద్ధి కోసం కొమ్ము కాసిన వారిని కాదని జంపింగ్ నేతలకు పెద్ద పీట వేయాలని చూడడం ఏంటన్న ఆవేదన అయితే సాగుతోంది. ఇక వైసీపీ ప్లీనరీకి కొద్ది రోజులు ముందుగానే ఒక వార్త అయితే గట్టిగా ప్రచారంలో ఉంది. వైసీపీ 151 మందితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక టీడీపీ వైపు నుంచి వైసీపీకి మద్దతుగా వచ్చిన నలుగురు  జంపింగ్ ఎమ్మెల్యేలకు గట్టి భరోసా ఇవ్వాలని హై కమాండ్ నిర్ణయించింది అని అంటున్నారు.

ఆ విషయాన్ని ప్లీనరీలోనే చెబుతారా దాని కంటే ముందే తెలియచేస్తారా అన్నదే ఇపుడు చర్చగా ఉంది. అయితే ఎపుడు చెప్పినా కూడా ఇక మీదట వారే వైసీపీ అభ్యర్ధులుగా రేపటి ఎన్నికల్లో ఆయా చోట్ల నిలుచుకుంటారు అన్న మాట. ఆ విధంగా చూసుకుంటే క్రిష్ణా జిల్లా గన్నవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా నెగ్గి వైసీపీలోకి వచ్చిన వల్లభనేని వంశీకి వైసీపీ టికెట్ కన్ ఫర్మ్ చేయనున్నారు అని తెలుస్తోంది.

గన్నవరంలో వైసీపీకి మొదటి నుంచి పనిచేస్తున్న నాయకులు ఉన్నారు. వారు యార్లగడ్డ వెంకటరావు, దుట్టా రామంచంద్రరావు. ఈ ఇద్దరు నేతలు 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసి వంశీ మీద ఓడారు. అయితే  2019 ఎన్నికల్లో వంశీ చాలా స్వల్ప తేడాతో బయటపడ్డారు. ఈసారి తమకు చాన్స్ ఇస్తే కచ్చితంగా వంశీని ఓడగొడతామని అంటున్నారు.

కానీ వంశీ మీద నమ్మకం పెంచుకున్న వైసీపీ హై కమాండ్ ఆయన వైపే మొగ్గు చూపుతోంది. గన్నవరంలో వర్గ పోరు ఉన్నా వంశీకే టికెట్ ఖరార్ చేయనుంది. రెండేళ్ళ ముందుగా దాన్ని ప్రకటించడం ద్వారా ఆయనను సాఫీగా పనిచేసుకోనీయాలని సూచిస్తోంది. అలా కాకుండా ఎవరైనా వర్గ పోరు పెంచినా సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఇక ఉన్న వారు ఉంటారు. లేని వారు వెళ్ళిపోతారు అన్న ఆలోచనతో ఈ డెసిషన్ ని వైసీపీ తీసుకుంటోంది అని అంటున్నారు.

ఇక విశాఖ సౌత్ ఓ కూడా ఇలాంటి సమస్య ఉంది. అక్కడ టీడీపీ నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీకి మద్దతుగా ఉన్నారు. ఆయన రాక పట్ల లోకల్ వైసీపీ లీడర్స్ వ్యతిరేకిస్తున్నారు. అయితే ఆయనకే టికెట్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినాయకత్వం కన్ ఫర్మ్ చేస్తోంది. ఈసరికే మాటవరసకు ఆయనకు చెప్పి ఉంచిన హై కమాండ్ తొందరలోనే బాహాటంగా అనౌన్స్ చేస్తుంది అని అంటున్నారు. ఈ పరిణామంతో అసంతృప్తిగా ఉన్న వారు అయితే తట్టాబుట్టా సర్దుకోవచ్చు అన్న మెసేజ్ కూడా ఇందులోనే ఉంటుంది అన్నది తెలిసిందే.

ఇక ప్రకాశం జిల్లాలోని చీరాల టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే కరణం బలరాం రెండేళ్ళ క్రితం వైసీపీలో చేరిపోయారు. ఆయనకు అక్కడ నుంచి వైసీపీ నుంచి పోటీ చేసిన ఆమంచి క్రిష్ణ మోహన్ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అయినా సరే ఇన్నాళ్ళు నచ్చచెప్పి చూసిన వైసీపీ హై  కమాండ్ ఇపుడు కీలక నిర్ణయం తీసుకుంటోంది అంటున్నారు. అదేంటి అంటే చీరాలను కరణం బలరాంకే వదిలేయాలని. వచ్చే ఎన్నికల్లో బలరాం కానీ ఆయన  కుమారుడు వెంకటేష్ కానీ  పోటీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారని తెలుస్తోంది.

ఇక గుంటూరు జిలాలో మద్దాల గిరికి కూడా సీటుని కన్ఫర్మ్ చేస్తారని చెబుతున్నారు. ఇలా టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి చేరిన నలుగురికీ టికెట్లు కన్ఫర్మ్ చేయడం ద్వారా తొలి జాబితాను ప్లీనరీ వేదికగా వైసీపీ రిలీజ్ చేస్తుంది అంటున్నారు. అయితే వారి మీద ఓడిన వైసీపీ నేతలు రగులుతున్నారు. ఈ నాలుగు సీట్లలో వైసీపీ నేతలతో  ఈ ఎమ్మెల్యేలకు ఏ కోశానా పొత్తు అయితే  లేదు. కానీ జంపింగ్ లీడర్లకే భరోసా ఇస్తూ వైసీపీ ఈ డేరింగ్ స్టెప్ వేయబోతోంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఈ నిర్ణయం వల్ల వైసీపీలో ఎలాంటి  వాతావరణం ఉంటుందో చూడాల్సిందే.
Tags:    

Similar News