తగ్గేదే లేదంటున్న వైసీపీ మేయర్...?

Update: 2022-01-23 23:30 GMT
విశాఖకే కాదు, రాష్ట్రానికే రత్నం లాంటి విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ పరం చేయాలన్న ప్రతిపాదనలను కేంద్రం తక్షణం విరమించుకోవాలని విశాఖ నగర  మేయర్ డిమాండ్ చేస్తున్నారు. కేవలం ఉక్కే కదా అని లెక్కలేదు అనుకుంటే కుదిరే పనే కాదు అంటున్నారు, విశాఖ ఉక్కు మీద మొత్తం మూడు జిల్లాల ఉత్తరాంధ్రా భవిష్యత్తు ఆధారపడి ఉందని ఆమె అన్నారు.

ఇక విశాఖ ఉజ్వల భవిష్యత్తు అంతా కూడా ఉక్కుతోనే సాగుతోంది అని ఆమె అన్నారు. విశాఖలో అతి పెద్ద కేంద్ర పరిశ్రమను ప్రైవేట్ పరం చేయడం అంటే విశాఖ ప్రగతిని నిలుపు చేయడమే అంటున్నారు. విశాఖ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో పెద్ద మొత్తంలో ఆదాయం వెళ్తోందని ఆమె గుర్తు చేశారు.

అలాంటి విశాఖకు న్యాయం చేయాలీ అంటే విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విషయంలో విశాఖ వాసులు ఎవరూ తగ్గరని ఆమె అన్నారు. తమ పాలకవర్గం అధికారంలోకి వచ్చాక కౌన్సిల్ లో ఫస్ట్ చేసిన తీర్మానం కూడా విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కంటిన్యూ చేయమనే అని ఆమె అన్నారు.

విశాఖ ఉక్కుని కాపాడుకుంటామంటూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విశాఖలో జరుగుతోంది. జీవీఎంసీ ఆద్వర్యాన జరుగుతున్న ఈ కార్యక్రమంలో మేయర్ తొలి సంతకం చేయడం ద్వారా తమది ఉక్కు సంకల్పం అని చాటారు. కేంద్రం ఈ విషయంలో పునరాలోచన చేసేంతవరకూ ఉద్యమం ఆగదని కూడా స్పష్టం చేశారు.  పార్టీలకు అతీతంగా సాగుతున్నా ఈ ఉద్యమంలో అందరూ పాలుపంచుకోవాలని ఆమె పిలుపు ఇచ్చారు.

అదే విధంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో అంతా పెద్ద ఎత్తున పాలుపంచుకోవాలని, విశాఖ వాసుల ఆకాంక్షను కేంద్రానికి తెలియచేయాలని ఆమె కోరారు. మొత్తానికి విశాఖ ఫస్ట్ లేడీ అయిన మేయర్ ఓట్టేసి మరీ ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటామని అంటున్నారు. ఈ విషయంలో ఎందాకైనా అని చెబుతున్నారు. తగ్గేది లేదని కూడా గట్టిగా చాటుతున్నారు.
Tags:    

Similar News