జగన్ ప్రత్యర్థి బాలయ్య సినిమా ఫెక్సీ పెట్టిన వైసీపీ ఎమ్మెల్యే కొడుకు.. వైరల్

Update: 2023-01-06 11:30 GMT
సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు. కానీ ఏపీలో ఈ రెండూ మిక్స్. సినీ తారలే రాజకీయాలు చేస్తుండడంతో వైరం ముదిరి పాకాన పడుతోంది. అభిమానం హద్దులు దాటుతున్నా పార్టీలో ఉన్న కొంతమంది ప్రత్యర్థులు దాన్ని చంపుకోవడం లేదు. తాజాగా ఈ విషయం మరోసారి రుజువైంది. ప్రత్యర్థి పార్టీకి చెందిన హీరో అయినా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే తనయుడు ఆరాధించడం వైరల్ అయ్యింది.

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు రాజకీయాల్లో ప్లెక్సీ కలకలం రేపుతోంది. వైసీపీ ఎమ్మెల్యే తనయుడు బాలయ్య సినిమాకు ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం దుమారానికి దారితీసింది.

బాలయ్య కొత్త సినిమా ‘వీరసింహారెడ్డి’ విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ రాజకీయం దుమారం రేపుతోంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే తనయుడు తన ఫొటోతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చర్చనీయాంశమైంది. వైసీపీ వాళ్లు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సినిమాకు ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం అటు వైసీపీ, ఇటు టీడీపీ శ్రేణుల్లో ఆసక్తి రేపుతోంది.

బాలయ్య సినిమా రిలీజ్ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి తనయుడు ధరణిధర్ రెడ్డితో ఫొటోతో ఫ్లెక్సీ ఎమ్మిగనూరులో హల్ చల్ చేస్తోంది. పోస్టర్ లో బాలయ్య పక్కన ధరణిధర్ రెడ్డి ఫొటో పెట్టి రాబోయే తరానికి కాబోయే ఎమ్మెల్యే అంటూ రాసిన కొటేషన్స్ రాయించాడు.

దీంతో వచ్చే ఎన్నికల్లో ధరణిధర్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీచేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వచ్చేసారి తాను పోటీచేయనని..తన కుమారుడు ధరణిధర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని వైసీపీ అధిష్టానాన్ని కోరారు.

ఇక మాజీ ఎంపీ బుట్టా రేణుకా, లింగాయత్ నేత రుద్రగౌడ్, మంత్రాలయం ఎమ్మెల్యే బాలానాగిరెడ్డిలు ఈ స్తానం కోసం పోటీపడుతున్నారు. ఇలాంటి సమయంలో ధరణిధర్ రెడ్డి ఫొటోతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం.. కాబోయే ఎమ్మెల్యే అని కొటేషన్స్ రాయడం చర్చనీయాంశమైంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News