వైసీపీ యువ ఎమ్మెల్సీ పరిస్థితి విషమం!

Update: 2022-11-02 06:02 GMT
కర్నూలు జిల్లా బనగానపల్లికి చెందిన వైసీపీ నేత, ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఆయన కాలేయ సమస్యతో బాధపడుతున్నట్టు చెబుతున్నారు. ఊపిరితిత్తుల్లో రక్తస్రావం కావడంతో రెండు రోజుల క్రితం తీవ్రమైన దగ్గుతో బాధపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్చారు.

ఊపిరితిత్తుల్లో రక్తస్రావం అవుతోందని.. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్టు సమాచారం. ఎమ్మెల్సీ బంధువు చల్లా రఘునాథరెడ్డి మాట్లాడుతూ... భగీరథరెడ్డికి వెంటిలేటర్‌పై చికిత్స జరుగుతుందన్నారు.

ఈ క్రమంలో మొదట 100 శాతం ఆక్సిజన్‌ ఇచ్చారని, ప్రస్తుతం 60 శాతానికి తగ్గించారని వెల్లడించారు. శరీరం చికిత్సకు సహకరిస్తున్నట్లు వైద్యులు తెలిపారని వెల్లడించారు.

కాగా చల్లా భగీరథరెడ్డి ప్రస్తుతం నంద్యాల జిల్లా అవుకులో ఉంటున్నారు. ఈయన వైసీపీ దివంగత నేత చల్లా రామకృష్ణారెడ్డి కుమారుడు. చల్లా రామకృష్ణారెడ్డి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పలుమార్లు కర్నూలు జిల్లా కోయిలకుంట్ల నుంచి ఎమ్మెల్యే గెలిచారు.

2009లో ఆ నియోజకవర్గం పునర్విభజనలో రద్దు కావడంతో బనగానపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014 తర్వాత టీడీపీలో చేరిన ఆయన ఏపీ పౌరసరఫరాల సంస్థ కార్పొరేషన్‌కు చైర్మన్‌గా పనిచేశారు.

2019 ఎన్నికల ముందు చల్లా రామకృష్ణారెడ్డి వైసీపీలో చేరారు. వైసీపీ ఎమ్మెల్సీగా వైఎస్‌ జగన్‌ చాన్సు ఇచ్చారు. కరోనా బారిన పడి గతేడాది కన్నుమూశారు. దీంతో జగన్‌ ఆయన కుమారుడు చల్లా భగీరథరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News