వైసీపీ, టీఆర్‌ఎస్‌ కవ్వింపులు అందుకేనా?

Update: 2022-10-03 03:45 GMT
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు తెలంగాణలో అధికార పార్టీ టీఆర్‌ఎస్, మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ వైసీపీ నేతలు మాటలతో హీట్‌ పెంచేస్తున్నారు. దీనిపై విశ్లేషకులు తమదైన శైలిలో విశ్లేషణ చేస్తున్నారు. సెంటిమెంటును రెచ్చగొట్టి వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందడానికే టీఆర్‌ఎస్‌ మరో ఎత్తుగడకు దిగిందని అంటున్నారు. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు అన్ని రకాలుగా సాయం అందించిన కేసీఆర్‌కు ఈసారి తన వంతు సాయం అందించడానికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ముందుకొచ్చారని చెబుతున్నారు. తమ మాటల ద్వారా వివాదాలను సృష్టించడం.. మరోమారు ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి లాభపొందడానికే కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని పేర్కొంటున్నారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం మాత్రమే ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో ఎన్నికల మూడ్‌ నెలకొంది. గత ఎన్నికల ముందు కేసీఆర్‌ తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లినట్టే.. వైఎస్‌ జగన్‌ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడం, ఆ సెంటిమెంటులో లాభపొందడం, తద్వారా తమ ప్రభుత్వాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను సైడ్‌ ట్రాక్‌ చేసేయడమే కేసీఆర్, వైఎస్‌ జగన్‌ల వ్యూహమని అంటున్నారు.

వాస్తవానికి.. తెలంగాణలో రెండోసారి కేసీఆర్, ఏపీలో జగన్‌ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఇరువురు నేతల మధ్యే సన్నిహిత సంబంధాలే కొనసాగాయి. జగన్‌ ప్రమాణస్వీకారానికి కేసీఆర్‌ ఏపీకి వస్తే.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వైఎస్‌ జగన్‌ తెలంగాణకు వెళ్లారు. ఇప్పటివరకు ఈ ఇద్దరు నేతలు మాట అనుకున్నది లేదు. అలాగే రెండు రాష్ట్రాల అధికార పార్టీ నేతల మధ్య కూడా సన్నిహిత సంబంధాలే కొనసాగాయి. మధ్యలో కేటీఆర్‌ ఏపీలో రోడ్ల దుస్థితి గురించి వ్యాఖ్యలు చేసినా అవి క్యాజువల్‌గా మాట్లాడుతూ తన ఫ్రెండ్‌ అన్న సంగతులని.. ఆ మాటలు తనవి కావని కేటీఆర్‌ తోసిపుచ్చారు.

అధికారంలోకి వచ్చి కేసీఆర్‌ (రెండో పర్యాయం) నాలుగేళ్లు, జగన్‌ మూడున్నరేళ్లు అవుతుంది. ఇన్నేళ్లలో ఎంతో అన్యోన్యంగా ఉన్న ఇరు పార్టీల నేతలు ఇంకా ఎన్నికలకు స్వల్ప సమయం మాత్రమే ఉన్న ఈ తరుణంలో మాటల దాడికి దిగుతుండటం గమనార్హమని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకరికొకరు లబ్ధి చేసుకోవాలన్నదే ఇరు పార్టీల వ్యూహమని అంటున్నారు.

అదేవిధంగా వైఎస్‌ జగన్‌ సోదరి వైఎస్‌ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టింది కూడా కేసీఆర్‌కు లబ్ధి చేకూర్చడానికేనని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌కు వెళ్లే రెడ్డి సామాజికవర్గం ఓట్లను, వైఎస్సార్‌ అభిమానుల ఓట్లను చీల్చి.. వాటిని తన వైపునకు మళ్లించుకుని కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణలో వీలైనంత నష్టం చేయడమే షర్మిల లక్ష్యమని విశ్లేషకులు నాడే చెప్పారు. జగన్, షర్మిల మధ్య అభిప్రాయ భేదాలు కూడా నిజం కాదని.. జగనే కేసీఆర్‌కు లబ్ధి చేకూర్చడానికి తన చెల్లిని దించారని ఢంకా బజాయించి చెబుతున్నారు.

గత కొన్ని రోజులుగా టీఆర్‌ఎస్‌లో ముఖ్య నేతలైన మంత్రులు.. హరీష్‌ రావు, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, తదితరులు, అలాగే వైఎస్సార్సీపీలో ముఖ్య నేతలైన సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, గుడివాడ అమర్‌నాథ్, పేర్ని నాని తదితరుల మధ్య మాటల తూటాలు పేలడం ఇందుకు నిదర్శనమని విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు. కీలక సమస్యలపై ప్రజల దృష్టిని మళ్లించడానికి, ప్రభుత్వ వ్యతిరేకతను కప్పి పుచ్చుకోవడానికి ఇలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News